సినిమా వేదికలపై రాజకీయాలొద్దు.. చిరంజీవికి రోజా చురకలు

రాజకీయాలు చేయాలని అనుకుంటే రాజకీయాల్లో ఉండి మాట్లాడాలని, సినిమాలే చేయాలని అనుకుంటే రాజకీయాల జోలికి రాకుండా సినిమాలే చేసుకోవాలని చిరంజీవికి సూచించారు.

Advertisement
Update:2023-08-09 17:22 IST

ప్రభుత్వంపై విమర్శలు చేసి మంత్రులకు టార్గెట్ గా మారిన మెగాస్టార్ చిరంజీవిపై విమర్శలు తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే చిరంజీవి చేసిన కామెంట్ల‌కు మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని కౌంటర్లు ఇవ్వగా.. తాజాగా మంత్రి రోజా సెటైర్లు పేల్చారు. సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడవద్దని చిరంజీవికి ఆమె చురకలు అంటించారు.

మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి గడప గడపకు వచ్చి చూస్తే తాము ఏం అభివృద్ధి చేశామో, ఎన్ని రోడ్లు వేశామో తెలుస్తుందని విమర్శించారు. ఏ అర్హత ఉందని సినిమా టికెట్ ధరలు పెంచాలని హీరోలు ప్రభుత్వాన్ని అడుక్కున్నారని రోజా ప్రశ్నించారు. హీరోలు అందరూ కలిసి ఎందుకు ముఖ్యమంత్రి జగన్ దగ్గరికి వెళ్లారని నిలదీశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, ఏ ఇతర హీరోలు విమర్శించడం లేదని ఆమె అన్నారు.

సినిమా వేదికలపై ప్రభుత్వాన్ని తిడితే సహించేది లేదని రోజా మండిపడ్డారు. రాజకీయాలు చేయాలని అనుకుంటే రాజకీయాల్లో ఉండి మాట్లాడాలని, సినిమాలే చేయాలని అనుకుంటే రాజకీయాల జోలికి రాకుండా సినిమాలే చేసుకోవాలని చిరంజీవికి సూచించారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో చిరంజీవి రాజకీయాల్లో ఉన్నారని, మరి అప్పుడు ప్ర‌త్యేక‌ హోదా గురించి ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చాడా..? అని రోజా ప్రశ్నించారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రాన్ని జగన్ అభివృద్ధి చేస్తున్నారని, చిరంజీవి చెబితే విని పనిచేసే పరిస్థితిలో ఆయన లేరని అన్నారు. 

Tags:    
Advertisement

Similar News