టీడీపీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరు : మంత్రి రోజా

తన పాలనలో ఏనాడూ మంచి సంక్షేమ పథకం తీసుకొచ్చిన దాఖలాలు లేవని రోజా విమర్శించారు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలకు తూట్లు పొడవటమే తప్ప.. చంద్రబాబు కొత్తగా చేసింది ఏమీ లేదని రోజా అన్నారు.

Advertisement
Update:2022-11-30 19:24 IST

టీడీపీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని, చంద్రబాబును చూసి పార్టీలోని నాయకులు, కార్యకర్తలే 'ఇదేం ఖర్మరా బాబూ' అని అనుకుంటున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు.. తన పాలనలో ఏనాడూ మంచి సంక్షేమ పథకం తీసుకొచ్చిన దాఖలాలు లేవని రోజా విమర్శించారు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలకు తూట్లు పొడవటమే తప్ప.. చంద్రబాబు కొత్తగా చేసింది ఏమీ లేదని రోజా అన్నారు.

రాజమహేంద్రవరంలో నిర్వహించిన సాంస్కృతిక సంబరాల్లో పాల్గొన్న మంత్రి రోజా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో అనవసరంగా చంద్రబాబుకు 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలు కట్టబెట్టామని ఏపీ ప్రజలు బాధపడుతున్నారని.. ఈసారి అసలు ఏమీ లేకుండా చేస్తే మనకు ఈ ఖర్మ తప్పుతుందని అనుకుంటున్నారని రోజా చెప్పారు.

చంద్రబాబు గతంలో బాదుడే బాదుడు అన్నారు. ఇప్పుడు ఇదేమి ఖర్మ అంటూ చంపుతున్నాడని ఏపీ ప్రజలు బాధపడుతున్నారు. టీడీపీలో బూత్ కమిటీలు కూడా వేసుకునే పరిస్థితి లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో నిలిపేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందని రోజా అన్నారు. వైసీపీ గురించి ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితి లేదని, ఇదేం ఖర్మరా బాబూ అని ప్రజలే అనుకుంటున్నారని రోజా విమర్శించారు.

చంద్రబాబు పార్టీని బతికించుకోవడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ వాటిలో స్వయంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే పాల్గొనడం లేదని ఆరోపించారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయని రోజా వెల్లడించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆయన ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చారని, రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లినా.. ఏ గడపకు వెళ్లినా ప్రజలు జగన్ వైపు ఉన్న విషయం తెలుస్తుందన్నారు.

అమరావతి టు అరసవెల్లి రైతుల యాత్ర అని చెప్పి, పెయిడ్ ఆర్టిస్టులతో తన బినామీల కోసం చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులందరూ తమ ఐడీ కార్డులతో యాత్రలో పాల్గొనాలని హైకోర్టు చెప్పగానే.. యాత్ర గాల్లో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. నిజమైన రైతుల బాధ చంద్రబాబుకు లేదు, కేవలం బినామీ పేర్లతో భూములు కొన్న వారి కోసమే ఆ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 175కి 175 సీట్లు కట్టబెడితే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని రోజా అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రం నుంచి చంద్రబాబు దత్త పుత్రుడు, ఉత్త పుత్రుడిని తరిమికొట్టాలని ప్రజలకు రోజా పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News