ఏపీలో 18చోట్ల టఫ్ ఫైట్ –కొడాలి నాని
18చోట్ల మాత్రం ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని, పోరు జోరుగా సాగుతుందన్నారు. మిగతా స్థానాల్లో ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని జోస్యం చెప్పారు కొడాలి నాని.
ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు సీఎం జగన్. టీడీపీ, జనసేనకు కనీసం 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేదనేవారు. పోటీపై కనీసం ప్రకటన చేసే ధైర్యం కూడా ఆ రెండు పార్టీలకు లేదని ఎద్దేవా చేసేవారు. అయితే 175 స్థానాల్లో 18చోట్ల తమకు గట్టిపోటీ ఉంటుందని అంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. 2019లో వచ్చిన 151 సీట్లకంటే 2024లో కచ్చితంగా ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామంటున్న కొడాలి నాని, 18చోట్ల మాత్రం ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని, పోరు జోరుగా సాగుతుందన్నారు. మిగతా స్థానాల్లో ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని జోస్యం చెప్పారు కొడాలి నాని.
రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పేదవారికోసమే సీఎం జగన్ ఖర్చు చేస్తున్నారని చెప్పారు కొడాలి నాని. పేదవారి ఆర్థిక బలోపేతానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ, ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని పథకాలు ఏపీలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే రోడ్లు వేయటం, కొత్త బిల్డింగ్ లు కట్టడమే కాదు.. ప్రజల ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయనేదానిపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు నాని. పేద, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావడానికే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు నాని.
పేదల తరపున జగన్ పోరాటం..
సంక్షేమ పథకాల అమలు చాలామందికి ఇష్టం లేదని, అలాంటి వారందరితో జగన్ పోరాటం చేస్తున్నారని, పేదల తరపున ఆయన దుర్మార్గులతో పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు కొడాలి నాని. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం జగన్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. చైతన్య, నారాయణ వంటి సంస్థలతో జగన్ యుద్ధం చేస్తున్నారన్నారు. కొంతమంది తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిసినా జగన్ అన్నింటికీ తెగించారని చెప్పారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ తర్వాత రాష్ట్రంలో భారీగా ఇండస్ట్రీలు ఏర్పాటవుతాయని, ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని అన్నారు కొడాలి నాని.