ప్రజలు అర్థం చేసుకోలేకపోవడం వల్లే ప్రభుత్వంపై కొద్దిగా వ్యతిరేకత

మూడేళ్ల క్రితం వరకు టీడీపీ ప్రభుత్వమే ఉందని.. ఈ మూడేళ్లలోనే రోడ్లన్నీ ఎలా దెబ్బతింటాయని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఏర్పడిన గుంత‌లు ఇప్పుడు పెద్దవి అయి ఉండవచ్చన్నారు.

Advertisement
Update:2022-11-08 15:47 IST

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో కొద్ది మేర వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమేనన్నారు. అది ప్రభుత్వం అమలుచేస్తున్న సంస్కరణలను ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఏర్పడిన వ్యతిరేకత అని విశ్లేషించారు. సంస్కరణలు మొదలుపెట్టే ప్రభుత్వంపై వ్యతిరేకత అధికంగానే ఉంటుంది.. ఒక సంస్కరణ అమలు పూర్తయిన తర్వాతే ఫలితాలు వస్తాయన్నారు. అంతకంటే ముందే ఫలితాన్ని అంచనా వేయడం వల్ల వ్యతిరేక భావన ఉంటుందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వంపైనా కొద్ది మేర వ్యతిరేకత ఉందన్నారు.

కేవలం డబ్బులు పంచుతున్నారు.. రోడ్లు వేయడం లేదంటున్నారు.. కానీ డబ్బులు పంచడం, రోడ్లు వేయడం రెండూ జరుగుతున్నాయన్నారు. మూడేళ్ల క్రితం వరకు టీడీపీ ప్రభుత్వమే ఉందని.. ఈ మూడేళ్లలోనే రోడ్లన్నీ ఎలా దెబ్బతింటాయని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఏర్పడిన గుంత‌లు ఇప్పుడు పెద్దవి అయి ఉండవచ్చన్నారు. అంతేగానీ జగనే వచ్చి రోడ్లన్నీ నాశనం చేసినట్టు, గుంతలు పెట్టినట్టు మాట్లాడడం సరికాదన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో రోడ్లన్నీ బాగున్నాయని.. కానీ ఎక్కడో ఒక గుంత ఉంటే దాన్ని పట్టుకుని మొత్తం అలాగే ఉందని ప్రచారం చేస్తున్నారని మంత్రి ధ‌ర్మాన‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News