బీజేపీ హిట్ లిస్ట్ లో ఏపీ.. జర జాగ్రత్త జగన్

తెలంగాణలో బేరాలు సాగినట్టు, ఏపీలో కూడా బేరసారాలు జరిగాయా..? జరిగితే అవి ఎందుకు బయటపడలేదు. పోనీ తెలంగాణ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఏపీపై దృష్టి సారించాలని అనుకున్నా.. ఏపీలో జగన్ ని కాదని బీజేపీతో జతకట్టేంత ధైర్యం ఎవరికుంది..? ఈ స్కెచ్ లో చంద్రబాబుకి కూడా వాటా ఉందా..?

Advertisement
Update:2022-11-03 21:47 IST

ఇప్పటి వరకూ దేశంలో 8 రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టింది. వైరి వర్గాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను నయానో భయానో తమవైపు తిప్పుకుని అక్కడి ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ, లేదా బీజేపీ సంకీర్ణం అధికారంలోకి వచ్చేది. మరో నాలుగు రాష్ట్రాలు బీజేపీ హిట్ లిస్ట్ లో ఉన్నాయి. వాటి పేర్లు తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టారు. తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, ఢిల్లీ ప్రభుత్వాలను కూలదోసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని వివరించారాయన.

ఢిల్లీలో ఆల్రడీ కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలు చేజారకుండా ముందుగానే గిరి గీసేశారు. రాజస్థాన్ లో గెహ్లాత్, పైలట్ వర్గాల మధ్య కుంపటి రాజేసి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇక తెలంగాణలో ఇటీవలే కుట్ర బయటపడింది. సమర్థవంతంగా బీజేపీ నీఛ రాజకీయాలను బట్టబయలు చేశారు సీఎం కేసీఆర్. పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో పక్కాగా బీజేపీ రాయబారుల్ని ఇరికించారు. ఇంకో రాష్ట్రంవైపు కన్నెత్తి చూడకుండా చేశారు. ఇక మిగిలింది ఏపీ. ఏపీలో కూడా బీజేపీ తన మాయోపాయాలను ప్రయోగిస్తుందనే విషయం ఇప్పుడు హైలెట్ గా మారింది.

అప్పటికీ ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీకి ప్రతి విషయంలోనూ వంత పాడుతోంది. కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికీ బీజేపీ మద్దతిస్తోంది. ఏపీ నుంచి ఏకంగా ఒక రాజ్యసభ సీటు కూడా బీజేపీ పరోక్షంగా సిఫారసు చేసినవారికి కేటాయించింది. బీజేపీకి మిత్రపక్షం కాదు కానీ, అంతకు మించి అన్నట్టుగా వైసీపీ, వైసీపీ నేతలు కేంద్రంతో సామరస్యంగా మసలుతున్నారు. మరి ఇలాంటి రాష్ట్రంపై బీజేపీకి ఎందుకంత కక్ష. ఏపీలో జగన్ ని దించేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారనేదే అసలు ప్రశ్న.

ఇలాంటి కుట్రలుంటాయని కాబోలు, ఆమధ్య వైస్సార్సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ తనని తాను ప్రకటించుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ అభ్యంతరంతో వెనక్కి తగ్గారు. కానీ ఏపీ విషయంలో బీజేపీ స్కెచ్ వేయడమే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం. తెలంగాణలో బేరాలు సాగినట్టు, ఏపీలో కూడా బేరసారాలు జరిగాయా..? జరిగితే అవి ఎందుకు బయటపడలేదు. పోనీ తెలంగాణ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఏపీపై దృష్టి సారించాలని అనుకున్నా.. ఏపీలో జగన్ ని కాదని బీజేపీతో జతకట్టేంత ధైర్యం ఎవరికుంది..? ఈ స్కెచ్ లో చంద్రబాబుకి కూడా వాటా ఉందా..? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చివరిగా తేలేదేంటంటే.. బీజేపీతో ఎంత వినయంగా మసలుకుంటున్నా.. వారు టార్గెట్ చేయాలంటే మాత్రం కచ్చితంగా తడిగుడ్డతో గొంతు కోస్తారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కుట్ర బయటపడింది కాబట్టి.. ఇకనైనా జగన్ బీజేపీని ఓ కంట కనిపెట్టడం మంచిది.

Tags:    
Advertisement

Similar News