ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

రైతుల పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఒకరకంగా ఇది ప్రభుత్వానికి ఎదురుదెబ్బే అనుకోవాలి. అయితే ప్రతిపక్షాల వల్లే ఇక్కడ పేదలకు ఇళ్లు అందుబాటులోకి రాకుండా పోయాయంటూ టీడీపీని బోనెక్కిస్తోంది వైసీపీ.

Advertisement
Update:2023-08-03 11:20 IST

అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ లో జగనన్న ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరితో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ యథాతథ స్థితి నెలకొంటుంది.

జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన, అంతలోనే అడ్డంకి..

అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం వ్యవహారం చాన్నాళ్లుగా కోర్టుల్లో నలుగుతోంది. అమరావతికోసం తాము భూములు కేటాయించామని, కాబట్టి.. అక్కడ స్థలాలయినా, ఇళ్లయినా తమకే కేటాయించాలంటున్నారు రైతులు. కాదు కాదు, అందులో పేదలకు కూడా అవకాశం ఇవ్వాలంటోంది వైసీపీ ప్రభుత్వం. ఇరు వర్గాలు కోర్టుకెక్కడంతో.. రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆర్-5 జోన్ ని సృష్టించి అక్కడ పట్టాలు పంపిణీ చేసింది. అక్కడితో ఆగకుండా ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెట్టింది.

ఆమధ్య సుప్రీంకోర్టు పట్టాల పంపిణీకి అనుమతి ఇస్తూనే.. తుది తీర్పుకి లోబడి ప్రవర్తించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో పట్టాల పంపిణీ పూర్తి చేశారు. ఆ వెంటనే వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణాలకు కూడా సిద్ధపడింది. సీఎం జగన్ చేతులమీదుగా శంకుస్థాపన కూడా చేశారు. పట్టాల పంపిణీ విషయంలోనే తుది తీర్పు రానప్పుడు, ఇళ్ల నిర్మాణం ఎలా మొదలు పెడతారంటూ రైతులు మళ్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగానే ఇళ్లు నిర్మించి, ఆ తర్వాత పేదల ఇళ్లు తొలగించడం కుదరదు అని చెప్పే వ్యూహంతో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని, వెంటనే స్టే విధించాలని హైకోర్టుని అభ్యర్థించారు రైతులు. స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, 1402 ఎకరాల కేటాయింపు అధికారాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ.. రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిపై విచారణ జరిపిన కోర్టు ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ ఈరోజు ఉత్తర్వులిచ్చింది. ఒకరకంగా ఇది ప్రభుత్వానికి ఎదురుదెబ్బే అనుకోవాలి. అయితే ప్రతిపక్షాల వల్లే ఇక్కడ పేదలకు ఇళ్లు అందుబాటులోకి రాకుండా పోయాయంటూ టీడీపీని బోనెక్కిస్తోంది వైసీపీ. 

Tags:    
Advertisement

Similar News