కరకట్టనైనా కూల్చేయాల్సిందే- ఏపీ హైకోర్టు

హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేసుకునేలా రాజ్యాంగం ఎక్కడైనా వెసులుబాటు ఇచ్చిందా అని ప్రశ్నించింది.

Advertisement
Update:2022-09-14 10:22 IST

ప్రభుత్వ భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి తీరుతామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, నదులు, స్మ‌శానాలు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో ఇటీవల హైకోర్టు సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. సుమోటో పిటిషన్‌తో పాటు ప్రభుత్వ భూముల ఆక్రమణలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కలిసి హైకోర్టు విచారిస్తోంది.

ఈ విచారణ సందర్భంగానే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులు, స్మ‌శానవాటికల స్థలాలన్నింటిని విడిపిస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని.. కొన్ని చోట్ల 30,40 ఏళ్ల క్రితమే నిర్మాణాలు చేశారని వాటి విషయంలో ఎలా ముందుకెళ్లాలో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరగా.. 30, 40 ఏళ్ల క్రితం నిర్మాణాలైనా సరే కూల్చివేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

ఆక్రమణదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అవడం వల్లనే భూముల ఆక్రమణ పెరుగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. డివిజన్ బెంచ్‌ ఆదేశాలు ఇస్తున్నా.. కొందరు సింగిల్ బెంచ్‌ వద్దకు వెళ్లి కూల్చివేతలకు వ్యతిరేకంగా స్టే తెచ్చుకుంటున్నారని.. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ఆ సమయంలో సింగిల్ జడ్జికి.. అటు పిటిషనర్లు కానీ, ఇటు ప్రభుత్వ అధికారులు గానీ తీసుకెళ్లడం లేదని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆక్షేపించింది.

కొందరు 30ఏళ్ల క్రితమే నిర్మాణాలు చేసుకుని జీవిస్తున్నారని.. వారి విషయంలో జీవించే హక్కుకు విఘాతం కలిగించకుండా చూడాలని, కూల్చివేతలకు ముందు అలాంటి వారికి నోటీసులు ఇవ్వాలని న్యాయవాది ఒకరు కోరగా.. హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేసుకునేలా రాజ్యాంగం ఎక్కడైనా వెసులుబాటు ఇచ్చిందా అని ప్రశ్నించింది. కూల్చివేతలకు ముందు నోటీసులు ఇస్తారని హైకోర్టు హామీ ఇచ్చింది.

ఇంతలో ప్రభుత్వ న్యాయవాది సుమన్... కృష్ణా నది కరకట్ట వెంబడి నిర్మాణాలను ప్రస్తావించారు. వాటిపై 10 వ్యాజ్యాలు దాఖలయ్యాయని గుర్తు చేశారు. కరకట్ట వెంబడి అక్రమ నిర్మాణాలపైనా విచారణ చేస్తామని.. ఒకవేళ నదిని ఆక్రమించి నిర్మించి ఉంటే కరకట్టనైనా సరే కూల్చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News