అత్తారింటిపై ఆయుధంగా 498ఏ- హైకోర్టు ఆందోళన

ఈ సెక్షన్ ఇటీవల పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోందని జస్టిస్ శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమాజంలో వివాహ బంధాల్లో వివాదాలు అసాధారణంగా పెరిగిపోతున్నాయని.. చిన్నచిన్న విషయాలకు కూడా 498ఏ కింద కేసు పెడుతున్నారని న్యాయమూర్తి విశ్లేషించారు.

Advertisement
Update:2022-10-08 06:58 IST

వరకట్న వేధింపు నిరోధక చట్టంలోని సెక్షన్‌ 498ఏ దుర్వినియోగంపై ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కేసు విచారణ సందర్భంగా 498ఏ అన్నది అసంతృప్తితో ఉన్న భార్యలకు.. తన భర్త, అత్తింటివారిని వేధించడానికి ఒక ఆయుధంగా మారుతోందని వ్యాఖ్యానించింది. 498ఏ కింద కేసు పెడితే చాలు అరెస్ట్ అన్న భావన ఉండడం సరికాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

ఈ సెక్షన్ ఇటీవల పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోందని జస్టిస్ శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమాజంలో వివాహ బంధాల్లో వివాదాలు అసాధారణంగా పెరిగిపోతున్నాయని.. చిన్నచిన్న విషయాలకు కూడా 498ఏ కింద కేసు పెడుతున్నారని న్యాయమూర్తి విశ్లేషించారు.

వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన షేక్ నూర్జహాన్ తన భర్త, అత్తమామలపై 498ఏ కింద కేసు పెట్టారు. అనంతరం పోలీసులు స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. తమపై నూర్జహాన్‌ తప్పుడు కేసు పెట్టిందని.. తమపై ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ భర్త, అతడి కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి.. ఈ కేసులో వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. పోలీసులు కూడా తమ చార్జిషీట్లో ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారని కోర్టు ప్రస్తావించింది.

నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే ఈ చట్టాన్ని వర్తింప చేయాల్సి ఉందని.. అలా కాకుండా కేవలం ఫిర్యాదు చేయగానే 498ఏను ప్రయోగించడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈకేసులో ఫిర్యాదుదారు కేవలం.. భర్తతో పాటు ఇతర కుటుంబసభ్యులతో సంగతి తేల్చుకునేందుకే కేసు పెట్టినట్టుగా ఉందని న్యాయస్థానం నిర్ధారణకు వచ్చింది. కాబట్టి అత్తింటివారిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.

Tags:    
Advertisement

Similar News