జనసేనకు షాకిచ్చిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ రద్దుకు నిరాకరణ
అసలు నిందితుడు కానీ మూడో వ్యక్తి ఎఫ్ఐఆర్ ను ఎలా సవాలు చేస్తారని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది.
జనసేన పార్టీకి హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన రగడపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఆ పార్టీ నాయకులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది. ఈనెల 15వ తేదీన విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. మంత్రుల కార్లను జనసైనికులు రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని మంత్రులు రోజా, జోగి రమేష్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అక్కడికి వచ్చారు.
కాగా, ఆ ముగ్గురు నాయకులను జనసేన నేతలు, కార్యకర్తలు చుట్టుముట్టి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రుల కార్లను ధ్వంసం చేశారు. జన సైనికుల దాడిలో మంత్రి రోజా వ్యక్తిగత సహాయకుడికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు పలువురు జనసేన నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా జనసేన నాయకులపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
అసలు నిందితుడు కానీ మూడో వ్యక్తి ఎఫ్ఐఆర్ ను ఎలా సవాలు చేస్తారని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది. పిటిషన్ కు విచారణ అర్హత ఉందో లేదో తేలుస్తామని పేర్కొంది. ఈ పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఎఫ్ఐఆర్ రద్దు కోసం జనసేన నేతలు హైకోర్టుకు వెళ్ళగా.. కోర్టు చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.