ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు గెలిచినట్టేనా..? హైకోర్టు ఏం చెప్పింది..?

షోకాజ్ నోటీసు విషయంలో పిటిషన్ దాఖలు చేసే అధికారం ఉద్యోగ సంఘానికి లేదని, అసలు నోటీసుకి సమాధానం ఇవ్వకుండా కోర్టులో పిటిషన్ వేయడం సరికాదంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు

Advertisement
Update:2023-02-01 05:54 IST

ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేదా..? వారు ఏమీ మాట్లాడకూడదా..? వారికి ఆర్టికల్-19 వర్తించదా..? మీడియాతో మాట్లాడిన మాటల్లో ప్రభుత్వాన్ని కించపరిచినట్లు ఎక్కడుంది? వారు ఏ నిబంధనను ఉల్లంఘించారో మీరిచ్చిన షోకాజ్‌ నోటీసులో ఎందుకు పేర్కొనలేదు..? ఇవీ మంగళవారం ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సంధించిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలతోనే సగం వ్యవహారం తేలిపోయింది. అయితే ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసు వ్యవహారంలో తుది తీర్పు వాయిదా వేశారు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ.

ఆమధ్య ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదని, ఒకటో తేదీ తమకు జీతాలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున కొంతమంది నాయకులు నేరుగా గవర్నర్ ని కలసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తాము ఎందుకు కలిశామో మీడియాకు వివరించారు. ఈ విషయంలో పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఉద్యోగ సంఘాలు గవర్నర్ కి చేసిన కంప్లయింట్ ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సదరు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేయాలని నిర్ణయించింది, షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసు చట్ట విరుద్ధమంటూ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

షోకాజ్ నోటీసు విషయంలో పిటిషన్ దాఖలు చేసే అధికారం ఉద్యోగ సంఘానికి లేదని, అసలు నోటీసుకి సమాధానం ఇవ్వకుండా కోర్టులో పిటిషన్ వేయడం సరికాదంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. నిబంధనలు ఉల్లంఘించామని ప్రభుత్వం పేర్కొంటున్నా, ఏ నిబంధనో స్పష్టంగా చెప్పలేదని, సమస్యల పరిష్కారం కోసం గవర్నర్ ని కలవడం కూడా తప్పేనా అంటూ ప్రశ్నించారు ఉద్యోగుల సంఘం తరపు న్యాయవాది. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పుని వాయిదా వేసింది. తీర్పు ఇచ్చే వరకు షోకాజ్ నోటీసులపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది హైకోర్టు. 

Tags:    
Advertisement

Similar News