హౌస్ హోల్డ్ మ్యాపింగ్.. తప్పులు దిద్దుకుంటున్న ఏపీ ప్రభుత్వం

2019లో సేకరించిన నవశకం సర్వేలోని డేటాలో కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు, చేర్పులకు వీలు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనుమ తర్వాత మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలను పొందవచ్చని గ్రామ, వార్డు సచివాలయ అధికారులు వెల్లడించారు.

Advertisement
Update:2023-01-15 08:00 IST

కొడుకు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తాడు, ఇక్కడ ఏపీలో వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పథకాలకు ఆగిపోతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కారు కొన్నా, పిల్లలు వేరే ఊరిలో కాస్త పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఆ ఇంటికి ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా.. తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఇన్నాళ్లూ ఏపీలో సంక్షేమ పథకాల అమలులో ఇదో పెద్ద సమస్యగా మారింది. ఇటీవల లక్షకు పైగా సామాజిక పింఛన్లు ఎగిరిపోడానికి ఇదే ప్రధాన కారణం. రేషన్ కార్డ్ లు వేర్వేరుగా ఉన్నా కూడా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అందరూ ఒకటే కదా అంటూ పథకాలను నిలిపివేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతున్నా, లబ్ధిదారుల విషయంలో పారదర్శకత ఉన్నా కూడా అనుకోకుండా వ్యతిరేకత కూడా పెరుగుతోంది. దీంతో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనే విధానంలో ఉన్న తప్పుల్ని ఏపీ ప్రభుత్వం దిద్దుకోవడం మొదలు పెట్టింది.

సంక్రాంతి నుంచి మొదలు..

2019లో సేకరించిన నవశకం సర్వేలోని డేటాలో కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు, చేర్పులకు వీలు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెళ్లైన జంటల్ని సర్వేలో ఒకే కుటుంబంగా చూపిస్తున్నా, వారు ప్రస్తుతం వేర్వేరుగా నివాసం ఉంటుంటే, ఆయా కుటుంబాలుగా వర్గీకరించేందుకు అవకాశం కల్పించింది. కనుమ తర్వాత మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలను పొందవచ్చని గ్రామ, వార్డు సచివాలయ అధికారులు వెల్లడించారు.

2019 లెక్కల ప్రకారం ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 1.67 కోట్ల కుటుంబాలున్నట్టు నవశకం సర్వేలో ఉంది. నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల¬కు లబ్ధిదారుల వివరాల సరిపోల్చుకునేందుకు నవశకం డేటానే ఆధారం. అయితే దీనివల్ల లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఇటీవల పింఛన్ల తొలగింపుతో ఈ వ్యవహారం మరింత విమర్శలకు తావిచ్చింది. కుటుంబాలు వేరయినా, రేషన్ కార్డులు వేరయినా కుటుంబ సభ్యులే కదా అనే పేరుతో ఓ పథకం ప్రకారం పథకాలను తొలగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలను పరిగణలోకి తీసుకుని ఈనెల 9నుంచి నవశకం డేటాలోని కుటుంబాలను వేరు చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. దీన్ని ఇప్పుడు రాష్ట్రమంతా అమలులోకి తెస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News