సిద్ధమవుతున్న శ్వేత పత్రాలు.. ఘాటెక్కనున్న విమర్శనాస్త్రాలు
వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని కూడా ఏపీ కేబినెట్ నిర్ణయించడం విశేషం. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య వర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ పేరుని పునరుద్ధరిస్తోంది.
ఏపీలో శ్వేత పత్రాల విడుదలకు సమయం ఆసన్నమైంది. కేబినెట్ లో లాంఛనంగా వీటికి ఆమోద ముద్ర పడింది. మొత్తం 6 శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గత ప్రభుత్వంలో ఏమేం జరిగాయనే వివరాలన్నిటినీ ఈ శ్వేత పత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం, విద్యుత్, పర్యావరణం, మద్యం పాలసీలు, ఆర్థిక అంశాలు-శాంతి భద్రతల నిర్వహణపై శ్వేత పత్రాలను కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కేటాయింపులు, ఆ కేటాయింపుల వల్ల వచ్చిన ఫలితాలను శ్వేతపత్రాల్లో ప్రజలకు వివరిస్తారు అధికారులు. సహజంగా ఈ శ్వేత పత్రాల్లో గత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో కూడా ఇటీవల ఇదే జరిగింది. శ్వేత పత్రాల విడుదల తర్వాత ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే జరగబోతోంది. శ్వేత పత్రాల విడుదల తర్వాత కూటమి, వైసీపీ మధ్య తీవ్ర విమర్శలు చెలరేగే అవకాశముంది.
గంజాయి నివారణకు ఉప సంఘం..
ప్రతిపక్షంలో ఉండగా ఏపీలో గంజాయి రవాణాపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేతలు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని చెబుతున్నారు. దీనికోసం కేబినెట్ లో కూడా చర్చ జరిగింది. ఏపీలో గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోం, రెవెన్యూ, హెల్త్, గిరిజన, మానవ వనరుల శాఖ మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
ఇక వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని కూడా ఏపీ కేబినెట్ నిర్ణయించడం విశేషం. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య వర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ పేరుని పునరుద్ధరిస్తోంది.