అర్జీలు తీసుకుంటున్నారు సరే.. నెక్స్ట్ ఏంటి..?

ప్రస్తుతానికి అర్జీల స్వీకరణపై నేతలు దృష్టి పెట్టారు. వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి, ఎంత త్వరగా సమస్యలు కొలిక్కి వచ్చాయనేదానిపై కూడా దృష్టిపెట్టాల్సి ఉంది.

Advertisement
Update:2024-06-30 07:09 IST

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. అర్జీల స్వీకరణలో చాలా స్పీడ్ గా ఉన్నారు. ఎక్కడ ఏ పర్యటనకు వెళ్లినా ముందుగా సందర్శకులకు ప్రయారిటీ ఇస్తున్నారు. వారి నుంచి అర్జీలు తీసుకున్నాకే మిగతా కార్యక్రమాలకోసం ముందుకు కదులుతున్నారు. పార్టీ ఆఫీసుల్లో కూడా అర్జీల స్వీకరణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు నేతలు. ఇంతవరకు బాగానే ఉంది. గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని, సీఎం జగన్ ఎన్నికల వేళ మినహా మిగతా టైమ్ లో ప్రజల్లోకి రాలేదని ఆరోపించిన అప్పటి ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షం.. ఇప్పుడు మార్పు తెచ్చామని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైందనే చెప్పాలి. అయితే నెక్స్ట్ ఏంటి..? అనేది చాలా ముఖ్యం. ఆ విషయంలో కూడా విజయవంతమైతేనే ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఏర్పడుతుంది.


చంద్రబాబు రాత్రి పొద్దుపోయే వరకు అర్జీలు తీసుకున్నారు..

పవన్ కల్యాణ్ ఓపిగ్గా బాధితుల దగ్గర కూర్చుని మరీ అర్జీలు తీసుకున్నారు..

నారా లోకేష్ ఇంటి ముందు పెద్ద క్యూ కనపడుతోంది..

ఇలాంటివన్నీ ప్రచారానికి బాగుంటాయి, కానీ సమస్యలు పరిష్కారం అయిన తర్వాత ప్రజలు సంతోషంగా మాట్లాడే మాటలే ప్రభుత్వానికి వారు వేసే అసలు సిసలు మార్కులు. అవి ఎన్ని ఎక్కువ వస్తే అధికారపార్టీకి అంత మేలు. ప్రస్తుతానికి అర్జీల స్వీకరణపై నేతలు దృష్టి పెట్టారు. వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి, ఎంత త్వరగా సమస్యలు కొలిక్కి వచ్చాయి. గతంలో ఏళ్లతరపడి పరిష్కారం కాని ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయాయా..? ఇలాంటివాటిపై కూడా దృష్టిపెట్టాల్సి ఉంది.

గత ప్రభుత్వంలో నేతలు నేరుగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు కానీ.. స్పందన పేరుతో వారం వారం ప్రజల వద్ద అధికారులు అర్జీలు తీసుకునేవారు. ఎన్నికల వేళ జగనన్నకు చెబుదాం అంటూ నేరుగా జగన్ కే ఫోన్ చేసి సమస్యలు చెప్పుకునే కార్యక్రమం కూడా తెరపైకి తెచ్చారు. దానివల్ల ఎవరికి ఏమేరకు ఉపయోగం కలిగిందో చెప్పలేని పరిస్థితి. జగనన్నకు చెప్పిన ప్రతి సమస్యా పరిష్కారమైందని అప్పట్లో వైసీపీ నేతలు చెప్పుకున్నారు కానీ, ఎన్నికల ఫలితాలు వారి మాటల్లో నిజమెంతుందో చెప్పకనే చెప్పాయి. ఆ తప్పు కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందా, లేక అర్జీల స్వీకరణతోపాటు, పరిష్కారంపై కూడా నేతలు దృష్టిపెడతారా..? వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News