ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వ తాయిలం
ఎప్పుడో ఒకప్పుడు బకాయిలు విడుదల చేసే కంటే.. టైమ్ చూసి పోలింగ్ రోజు ఖాతాల్లో నగదు జమ చేస్తే, దాని ప్రభావం ఏ కాస్త ఉన్నా, అది తమ విజయానికి ఏమాత్రం ఉపయోగపడినా చాలనుకుంటోంది జగన్ సర్కారు.
5 ఎమ్మెల్సీ స్థానాలకు ఏపీలో ఈరోజే పోలింగ్. పట్టభద్రులు, ఉపాధ్యాయులే ఓటర్లు. దాదాపుగా ఉద్యోగుల్లో ఎక్కువమంది పట్టభద్రులే ఉంటారు కాబట్టి.. ఒకరకంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువశాతం ఈ ఎన్నికల్లో ఓటర్లేనన్నమాట. ఇప్పటి వరకూ ఈ ఉద్యోగులనబడే ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. రకరకాల కారణాలున్నాయి, అందులో బకాయిల విడుదల ఆలస్యం ఒకటి. అయితే సడన్ గా పోలింగ్ రోజే ఆ బకాయిలు ప్రభుత్వం విడుదల చేస్తోంది.
అంటే ఈరోజే ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల బకాయిల చెల్లింపులు మొదలవుతున్నాయి. ఈనెల 31ల గా 3వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజు నగదు విడుదల ప్రారంభించింది. అందుకే దీన్ని ఎన్నికల తాయిలం అంటున్నాయి ప్రతిపక్షాలు.
సరిగ్గా టైమ్ చూసి హామీ అమలు..
ప్రభుత్వ ఉద్యోగులు ఈ తాయిలాలకు పడిపోతారని అనుకోలేం. అయితే సరిగ్గా పోలింగ్ రోజే బకాయిల విడుదల మొదలైందంటే కచ్చితంగా ఆ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అప్పటి వరకూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాస్తో కూస్తో తగ్గుతుంది. అదే చాలు అనుకుంటోంది ప్రభుత్వం.
ఎప్పుడో ఒకప్పుడు బకాయిలు విడుదల చేసే కంటే.. టైమ్ చూసి పోలింగ్ రోజు ఖాతాల్లో నగదు జమ చేస్తే, దాని ప్రభావం ఏ కాస్త ఉన్నా, అది తమ విజయానికి ఏమాత్రం ఉపయోగపడినా చాలనుకుంటోంది జగన్ సర్కారు.
ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలను ఆల్రడీ ఆర్థిక శాఖ క్లియర్ చేసింది. వీటికి నగదు ఈరోజు జమ అవుతుంది. ప్రభుత్వం నుంచి ఈమేరకు ప్రకటన రాగానే.. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. మిగతా సంఘాలు కూడా ఈ ప్రక్రియను స్వాగతించాల్సిందే. జై జగన్ అనాల్సిందే.
ఒకరకంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఉద్యోగుల్లో చల్లారినట్టే చెప్పాలి. దాని ప్రభావం ఓటింగ్ పై ఉంటుందా లేదా అనే విషయం పక్కనపెడితే, ప్రభుత్వం తమ ప్రయత్నం చేసింది. సరిగ్గా టైమ్ చూసుకుని బకాయిల విడుదలకు మహూర్తం ఫిక్స్ చేసింది.