హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్‌లో హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఏపీలోని బ్రాంచ్‌ల ద్వారా వసూలు చేసిన డబ్బును అక్కడికి తరలిస్తూ మార్గదర్శి యాజమాన్యం స్వాహా చేస్తోందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
మార్గదర్శి అక్రమాలను నిగ్గుతేల్చే విషయంలో ఏపీ ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడటం లేదు. ఇటీవల మార్గదర్శి యజమానులు, సంస్థ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు వద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటీషన్‌పై విచారణ జరిపింది.
హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 18కి వాయిదా పడింది. హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తునకు అడ్డుగా మారాయని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకులు వద్దని ఇది వరకే కోర్టు తీర్పులున్నాయన్నారు. ఏపీలోనే మార్గదర్శికి సంబంధించి ఖాతాదారులు అధికంగా ఉన్నారని.. ఆ సంస్థ ఆఫీస్ మాత్రం హైదరాబాద్‌లో ఉంటోందని ఆ కారణంగా తెలంగాణ హైకోర్టు ఏపీకి చెందిన దర్యాప్తు సంస్థల విచారణను అడ్డుకోవడం సరికాదన్నారు.
హైదరాబాద్‌లో హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఏపీలోని బ్రాంచ్‌ల ద్వారా వసూలు చేసిన డబ్బును అక్కడికి తరలిస్తూ మార్గదర్శి యాజమాన్యం స్వాహా చేస్తోందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.