వాస్తవాలు దాచి అమరావతి వాదుల పిటిషన్లు

అమరావతి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఇచ్చామని.. 66.8 శాతం మేర రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.

Advertisement
Update:2022-12-24 09:41 IST

అమరావతి వాదులు వాస్తవాలను దాచి హైకోర్టులో పిటిషన్లు వేశారని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అమరావతిలో భూములు ఇచ్చిన తమకు ప్రభుత్వం ఇంకా ప్లాట్లను ఇవ్వలేదని కొందరు పిటిషన్ వేశారు. తమకు ఇవ్వకుండానే రాష్ట్రంలోని ఇతరులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కోర్టుకు వెళ్లారు.

ఈ వాదనలో ఎంతమాత్రం నిజం లేదని హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది. ఇప్పటి వరకు తమకు ప్లాట్లు ఇవ్వలేదంటూ అమరావతివాదులు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని నిరూపించేందుకు అవసర‌మైన పత్రాలను కోర్టుకు సమర్పించింది. అమరావతి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఇచ్చామని.. 66.8 శాతం మేర రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. మిగిలిన వారికి కూడా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కానీ, వారే ముందుకు రావడం లేదని ప్రభుత్వం వివరించింది. ప్లాట్లు తీసుకునేందుకు కొందరు ముందుకు రాకపోవడం ప్రభుత్వ తప్పిదం కాబోదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు.

వాస్తవాలను తొక్కిపెట్టి అమరావతి రైతులు పిటిషన్లు వేశారని నిరూపించేందుకు అవసరమైన పత్రాలను కోర్టుముందుంచారు. డాక్యుమెంట్లు భారీగా ఉన్నందున వాటన్నింటిని పరిశీలించ సాధ్యం కాదు కాబట్టి.. ఒక్కో గ్రామానికి చెందిన రెండుమూడు డాక్యుమెంట్లను తమ ముందుంచాలని వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News