చిన్న విషయాలపై రాద్ధాంతం సరికాదు.. ఇప్పటంపై అలీ రియాక్షన్
ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం ఇస్తోందని, అయినా కూడా నిందలు వేయడం సరికాదన్నారు అలీ. ప్రతిపక్షాలు, అభివృద్ధికి సహకరించాల్సింది పోయి వెనక్కు లాగాలని చూడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా బాధ్యతలు చేపట్టిన సినీ నటుడు అలీ.. అప్పుడే వైరి వర్గాలకు చురకలంటిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదంటున్నారాయన. ఇప్పటం ఘటనపై స్పందించిన అలీ.. ఇరుకు రోడ్లలో వెళ్లాలనుకోవడం మూర్ఖత్వం అని, రోడ్ల వెడల్పుని అడ్డుకోవడం రాజకీయ పార్టీలకు తగదని చెప్పారు. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు సహించరని అన్నారు అలీ.
పరిహారం ఇస్తున్నా నిందలా..?
ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం ఇస్తోందని, అయినా కూడా నిందలు వేయడం సరికాదన్నారు అలీ. జనాభా పెరుగుతోందని, ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడకు వచ్చి సౌకర్యంగా తమ పనులు చేసుకోగలుగుతున్నారని, ఇలాంటి సమయంలో ఇరుకు రోడ్లతో అభివృద్ధి అంటే కుదరని పని అని చెప్పారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని, ప్రతిపక్షాలు సహకరించాల్సింది పోయి వెనక్కు లాగాలని చూడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మీడియా సలహాదారుగా విలువైన సూచనలిస్తూ ప్రభుత్వానికి, మీడియాకు తనవంతు సహకారం అందిస్తానన్నారు అలీ.
2024లో మళ్లీ జగన్ దే అధికారం..
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా 2024లో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని, ప్రజలు వైసీపీకే పట్టం కడతారన్నారు అలీ. తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా వైసీపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కళ్లముందు కనపడుతున్నాయని, వచ్చే దఫా ప్రజలు కచ్చితంగా వైసీపీనే గెలిపిస్తారని చెప్పారు. తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని పూర్తి న్యాయం చేస్తానని నమ్మకంగా చెప్పారాయన. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.