పోటీకి సై అంటున్న అలీ.. జగన్ నిర్ణయమే ఆలస్యం
నియోజకవర్గాలపై పుకార్లు సహజంగానే వినిపిస్తుంటాయని అన్నారు అలీ. పార్టీ ఆదేశిస్తే.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.
సినీ నటుడు, ప్రస్తుత ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేయడం దాదాపుగా కన్ఫామ్ అని తేలిపోయింది. మీడియా సలహాదారు హోదాలో వివిధ ప్రాంతాలకు వెళ్తున్న అలీ ఎన్నికల్లో పోటీపై పదే పదే కామెంట్లు చేయడమే దీనికి నిదర్శనం. ఆమధ్య పవన్ కల్యాణ్ పై పోటీకి సై అన్న అలీ, ఇప్పుడు జగన్.. నియోజకవర్గాన్ని ఫైనల్ చేయడమే తరువాయి అంటున్నారు.
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో RPL క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన అలీ, ఏడు రాష్ట్రాల నుండి టీమ్స్ ను తీసుకువచ్చి రాజమండ్రిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కొన్ని వందల సినిమాలు షూటింగ్ జరిగాయని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎక్కడినుంచి పోటీ చేయమంటే, తాను అక్కడినుంచి పోటీ చేస్తానని చెప్పారు. నియోజకవర్గాలపై పుకార్లు సహజంగానే వినిపిస్తుంటాయని అన్నారు. పార్టీ ఆదేశిస్తే.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.
అలీకి అవకాశం ఉంటుందా..?
151 ఎమ్మెల్యేలతోపాటు, టీడీపీ, జనసేన నుంచి అదనపు బలం కూడా ఉన్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో టికెట్ల సర్దుబాటు తలకు మించిన భారం అనేది బహిరంగ రహస్యమే. అయితే ఇటీవల ఎమ్మెల్యేలు చేజారుతుండటం, కొన్ని చోట్ల ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ సందేహాలు వ్యక్త పరుస్తుండటంతో.. 2024లో మరిన్ని కొత్త మొహాలు తెరపైకి వస్తాయనే అంచనాలు మొదలయ్యాయి. అంటే కచ్చితంగా అలీ వంటి వారికి అవకాశం ఉంటుంది. ఈలోగా తనకున్న పదవితో పర్యటనలు చేస్తూ, ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు అలీ. ఎక్కడికెళ్లినా తాను పోటీ చేస్తాను, ఏ నియోజకవర్గంనుంచైనే సరేనంటూ సవాళ్లు విసురుతున్నారు. గత ఎన్నికల్లోనే అలీకి టికెట్ దక్కుతుందని అనుకున్నా, ఆయన కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. ఈసారి మాత్రం ఆయన కచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గ్యారెంటీ అంటున్నారు. మైనార్టీల బలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో అలీని పోటీకి దింపుతారా, లేక పవన్ ని టార్గెట్ చేయడానికి అలీని వైసీపీ ప్రయోగిస్తుందా అనేది తేలాల్సి ఉంది. అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా.. అలీ మాత్రం పోటీకి సై అంటున్నారు.