100శాతం స్ట్రైక్ రేట్.. ఏపీలో ఇదే ట్రెండింగ్
100 శాతం స్ట్రైక్ రేట్ జనసేనదేనంటూ క్రికెట్ పరిభాషలో ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు జనసైనికులు.
ఏపీ అసెంబ్లీ-లోక్ సభ ఫలితాలు(175 - 25)
టీడీపీ - (135 - 16)
జనసేన - (21 - 2 )
వైసీపీ - (11-4)
బీజేపీ - (8-3)
ఇందులో వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు ఒంటరిగా పోటీ చేసింది. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలకు గాను 135 చోట్ల గెలిచింది. 17 లోక్ సభ సీట్లలో పోటీ చేసి ఒకటి కోల్పోయింది. బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే 8 చోట్ల విజయం దక్కింది. 6 లోక్ సభ స్థానాలు తీసుకుని 3 మాత్రమే గెలిచింది. ఇక జనసేన విషయానికొద్దాం. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ జనసేన విజయం సాధించింది. ఇది పవన్ కల్యాణ్ కూడా ఊహించని ఫలితం.
ఎన్నికల ప్రచారంలో పవన్ ఎప్పుడూ 21 స్థానాలు గెలుస్తామని ధీమాగా చెప్పలేదు. ఆ మాటకొస్తే 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా జనసేనకు ఓట్లు పడతాయని ఎవరూ అనుకోలేదు. కానీ పోటీ చేసిన స్థానాలన్నిట్లో నూటికి నూరుశాతం విజయం సాధించి జనసేన అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 100 శాతం స్ట్రైక్ రేట్ జనసేనదేనంటూ క్రికెట్ పరిభాషలో ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు జనసైనికులు.
ఏపీలో ఏ పార్టీ ఓటు బ్యాంకు ఏ పార్టీకి కలిసొచ్చిందనే విషయాన్ని పక్కనపెడితే.. టీడీపీ, జనసేన ద్వారా బీజేపీ మాత్రం ఏపీలో భారీగానే లాభపడింది. సొంతంగా పోటీ చేసినా, కేవలం జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా బీజేపీ ఏపీలో ఖాతా తెరిచే అవకాశం లేదు. కూటమి కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోలేదు కాబట్టి బీజేపీ ఒడ్డునపడింది. కూటమిలోని టీడీపీ, బీజేపీ.. తమకు కేటాయించిన సీట్లను కొంతమేర కోల్పోయినా, పోటీ చేసిన అన్ని సీట్లలోనూ గెలిచిన జనసేన సరికొత్త రికార్డ్ సృష్టించింది.