సీఎం ఇంటిని ముట్టడిస్తామంటే ఊరుకుంటామా..? ఛలో విజయవాడకు నో పర్మిషన్..
సీపీఎస్ రద్దుకి కొన్ని ఇబ్బందులున్నాయని, పాత పెన్షన్ విధానం కంటే మెరుగ్గా జీపీఎస్ ఇస్తామంటుంటే ఉద్యోగులు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సీఎం ఇంటిని ముట్టడిస్తామంటే అనుమతి ఎలా ఇస్తామని అన్నారు.
ఏపీలో సీపీఎస్(కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) పోరు మరింత ఉధృతమయ్యేలా ఉంది. ఇప్పటికే సీపీఎస్ రద్దుపై జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం జీపీఎస్(గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్) ఇస్తామంటుంది, ఉద్యోగులు ఓపీఎస్(ఓల్డ్ పెన్షన్ స్కీమ్) కావాలంటున్నారు. ఈ దశలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. సెప్టెంబర్ 1న సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. ఛలో విజయవాడ అంటూ వేలాదిగా ఉద్యోగులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి రాబోతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటోంది. ఇప్పటికే పోలీసులు జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులిచ్చారు. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారు.
సీఎం ఇంటి ముట్టడికి ఎలా అనుమతిస్తాం..?
సీపీఎస్ రద్దుకి కొన్ని ఇబ్బందులున్నాయని, పాత పెన్షన్ విధానం కంటే మెరుగ్గా జీపీఎస్ ఇస్తామంటుంటే ఉద్యోగులు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సీఎం ఇంటిని ముట్టడిస్తామంటే అనుమతి ఎలా ఇస్తామని అన్నారు. ఉద్యోగులు పునరాలోచించుకోవాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో ఉందని, కోరి ఘర్షణ వాతావరణం కొని తెచ్చుకోవద్దంటున్నారు.
పోలీసుల అప్రమత్తత..
ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఉద్యోగులు పీఆర్సీకోసం, సీపీఎస్ రద్దుకోసం ఛలో విజయవాడ చేపట్టారు. అప్పట్లో పోలీసులు ఉద్యోగులను తక్కువ అంచనా వేయడంతో ఆ కార్యక్రమం సక్సెస్ అయింది. వేలాదిమంది ఉద్యోగులు విజయవాడ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఆ తర్వాతే ఏపీ డీజీపీ అర్థాంతరంగా అప్రాధాన్య పోస్ట్ కి బదిలీ కావడం వేరే విషయం. ఇప్పుడు పోలీసులు అలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడలో 144 సెక్షన్ అమలులో ఉందని, సెక్షన్ -30 పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉందని చెబుతున్నారు పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా. కొన్ని అసాంఘిక శక్తులు విజయవాడ పరిసర ప్రాంతాలలో రెక్కి నిర్వహించి శాంతి భధ్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రయత్నిస్తున్నాయని అందుకే 144 సెక్షన్ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నాయకులకు నోటీసులిస్తున్నారు. విద్యాశాఖలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తూ సెలవలు రద్దు చేశారు. ఛలో విజయవాడకోసం ఎవరైనా సెలవు పెడితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోడానికి సిద్ధమయ్యారు.
తగ్గేదే లేదు..
ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. పీఆర్సీ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. తాము అడిగినంత బెనిఫిట్స్ ఇవ్వలేదని, జీతాలు ఆశించిన స్థాయిలో పెరగలేదని గుర్రుగా ఉన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో కూడా తప్పంతా ప్రభుత్వానిదేనంటున్నారు ఉద్యోగులు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి తమ ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడిలా మాట మార్చడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద ఛలో విజయవాడ మరోసారి ఏపీలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించేలా ఉంది.