మా దగ్గర మంత్రదండం ఉండదు కదా?- మీడియాకు డీజీపీ క్లాస్‌

నేరస్తులకు భయం లేదంటూ ప్రచారం చేస్తున్నారని.. కానీ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గతేడాది 60వేల నేరాలు తగ్గాయన్నారు. భయం ఉండబట్టే నేరాల సంఖ్య తగ్గుతోందన్నారు.

Advertisement
Update:2023-06-16 16:50 IST

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడి కిడ్నాప్‌ ఆధారంగా రాష్ట్రంలో మొత్తం శాంతిభద్రతలు క్షీణించిపోయాయి అన్నట్టు వార్తలు రాయడం సరికాదన్నారు ఏపీ డీజీపీ క‌సిరెడ్డి రాజేంద్ర‌నాథ్‌రెడ్డి. 2020 నుంచి ఇప్పటి వరకు నేరగణాంకాలను పరిశీలిస్తే నేరాలు ఏ స్థాయిలో తగ్గుముఖం ప‌ట్టాయో అర్థమవుతుందన్నారు. కిడ్నాప్‌ సమాచారం అందగానే గంటల వ్యవధిలోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారని వివరించారు. పోలీసులు తమ సత్తా చూపిస్తున్నా రాష్ట్రం మొత్తం నేరమయం అయిందన్నట్టు కథనాలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకుని రాయాలన్నారు.

గత రెండేళ్ల కాలంలో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు ఇలా అన్ని నేరాలు తగ్గాయని చెప్పారు. శాంతిభద్రలు క్షీణించిపోయాయని కథనాలు రాసి ప్రజలను భయపెట్టడం సరికాదన్నారు. విశాఖలో రౌడీషీటర్ల కదలికలు లేవన్నారు. భూకబ్జాలు కూడా లేవన్నారు. ఎక్కడైనా కబ్జాలు జరుగుతుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

హేమంత్ ముఠా ఇటీవలే కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయి బయటకు వచ్చిందని.. వారిపై ఇప్పుడు పీడీ యాక్ట్ మోపుతున్నట్టుగా చెప్పారు. ఫాస్ట్‌ ట్రాక్ కోర్టుకు ఈ కేసును అప్ప‌గిస్తున్నట్టు చెప్పారు. మూడు నెలల్లో ట్రయల్‌ పూర్తవుతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లా అండ్ ఆర్డర్‌కు ఇబ్బందిపెడుతున్న తీవ్రమైన 120 నేరాల్లో ఇప్పటికే 90 కేసుల్లో శిక్షపడేలా ఒక్క ఏడాదిలోనే చేశామన్నారు. హత్యలు, కిడ్నాప్‌లు, హత్యాయత్నాలు, మహిళలపై దాడుల కేసుల్లో ఏడాదిలోపే శిక్షపడేలా ప‌నిచేస్తున్నామన్నారు. కేసు తేలడానికి ఐదేళ్లు పడుతుంది, పదేళ్లు పడుతుంది అన్నది గతమని.. ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి లేదన్నారు. దేశంలో ఎక్కడాలేనంత వేగంగా శిక్షలుపడేలా చేస్తున్నామన్నారు.

నేరస్తులకు భయం లేదంటూ ప్రచారం చేస్తున్నారని.. కానీ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గతేడాది 60వేల నేరాలు తగ్గాయన్నారు. భయం ఉండబట్టే నేరాల సంఖ్య తగ్గుతోందన్నారు. నేరాలు జరగకుండా ముందుగానే అడ్డుకట్ట వేసేందుకే వేగంగా శిక్షలు పడేలా చేస్తున్నట్టు వివరించారు. అయినా సరే మీడియా వాళ్లకు అప్పుడప్పుడు ఉత్సాహం ఎక్కువపోయి రాసేస్తున్నారని డీజీపీ విమర్శించారు. ఎక్కడైనా నేరం జరుగుతుంటే ఎవరో ఒకరు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని.. ఎవరి ఇంట్లో ఏం జరుగుతోంది అని తెలుసుకునేందుకు పోలీసుల దగ్గర మంత్రదండం ఉండదు కదా అని ప్రశ్నించారు.

13 తేదీనే కిడ్నాప్‌ జరిగినా సమాచారం 15న ఇచ్చారని.. గంటల వ్యవధిలోనే వారిని పట్టుకున్నామని వివరించారు. కిడ్నాపర్లు ఎంపీ కుమారుడి ఇంట్లో ఉన్నారని విషయం పోలీసులకు ఎలా తెలుస్తుందన్నారు. నిందితుడు హేమంత్ మీద 2010 నుంచే 30 కేసులు ఉన్నాయన్నారు. కానీ ఇంతకాలం అతడికి శిక్ష వేయించే అంశంపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఇవన్నీ జరగాయన్నారు. ఇప్పుడు అతడికి మూడు నెలల్లోనే శిక్షపడేలా ఫాస్ట్‌ ట్రాక్‌కు అప్ప‌గిస్తున్నామన్నారు. డబ్బు కోసమే కిడ్నాప్‌ జరిగిందని, మరో కారణం ఏమీ లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News