పవన్ కల్యాణ్ ఫస్ట్ ప్రయారిటీ అదే..

గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సాయం అడుగుదామన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఈ విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తామని చెప్పారు.

Advertisement
Update:2024-07-12 07:22 IST

రాష్ట్రంలోని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, పైగా పంచాయతీరాజ్ శాఖకు ఆయనే మంత్రి. ఆయన హయాంలో రోడ్ల నిర్మాణానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడెలా ఉన్నాయి.. అనే తేడా చూపించేందుకు డిప్యూటీ సీఎం ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై గ్రామీణ రహదారుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.


ఇదీ ప్రణాళిక..

ఏపీలో 7,213 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి తక్షణం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్. రూ.4,976 కోట్ల నిధుల కేటాయింపుపై కూడా చర్చించారు. 250 మందికి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ రోడ్డు ఉండాలని ఆదేశించారు పవన్. ‘2018-19లో మొదలైన ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) ప్రాజెక్టు ద్వారా నెలకు రూ.200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే సమస్యలు ఉండవని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించే రహదారులకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.75 కోట్ల మ్యాచింగ్‌ గ్రాంట్‌ సమకూరిస్తే బ్యాంకు మరో రూ.125 కోట్ల రుణం మంజూరుచేస్తుంది. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల ఆలస్యం చేయడం వల్ల రహదారుల నిర్మాణం పూర్తి కాలేదని ఈ చర్చల్లో తేలింది.

రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30 శాతం మ్యాచింగ్ గ్రాంటును 10 శాతానికి తగ్గించే విధంగా కేంద్రం ప్రభుత్వాన్ని కోరదామని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయని చెప్పారాయన. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సాయం అడుగుదామన్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తామని చెప్పారు. మొత్తమ్మీద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విషయంలో పవన్ కల్యాణ్ తనదైన మార్కు చూపించాలనుకుంటున్నారు. రోడ్ల నిర్మాణానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News