నిఖార్సయిన పెస్టిసైడ్ సీఎం జగన్
జనసైనికులంతా తన తమ్ముళ్లని, టీడీపీ వారు ముదిరిపోయిన మొక్కజొన్న గింజలని మంత్రి కొట్టు చెప్పారు. తప్పుడు మార్గాల్లో వెళ్లవద్దని జన సైనికులకు సూచించారు.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించారు. వైఎస్ జగన్ నిఖార్సయిన పెస్టిసైడ్ అని ఆయన చెప్పారు. అదేంటి సీఎం జగనేంటి.. పెస్టిసైడ్ ఏంటి.. అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీనిపై మంత్రి కొట్టు ఏమంటారంటే.. బాగా పండిన పంటలను నాశనం చేసే చీడపీడల నుంచి కాపాడేది పెస్టిసైడ్ అయితే.. చక్కగా ఉన్న రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం మరోసారి గద్దెనెక్కాలని చూస్తున్న చీడపీడల వంటివారు బాబు, పవన్, ఎల్లో మీడియా అని.. వారి నుంచి ప్రజలను, రాష్ట్రాన్ని రక్షించే నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని వివరించారు.
తాడేపల్లిగూడెంలో సోమవారం మంత్రి కొట్టు సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సందర్భంగా జగన్ ఇచ్చిన నవరత్నాల హామీలు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పిన ప్రతిపక్షాలకు.. సమర్థంగా అమలు చేసి చూపించారని గుర్తుచేశారు. అయినా ప్రతిపక్షాలు జగన్‌ను చూసి బుద్ధి తెచ్చుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం జగన్ అందిస్తున్న పాలనను దేశమంతా చూస్తోందన్నారు. కాపు ఓట్ల కోసం చంద్రబాబు చూస్తుంటే, కాపులను చూపించి చంద్రబాబు నుంచి ఎంత కొల్లగొట్టాలా అని పవన్ చూస్తున్నాడని దుయ్యబట్టారు. వీరిద్దరూ స్వార్థపరులేనని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబు, పవన్‌ల దొంగ నాటకం తెలంగాణ ఎన్నికల్లో బట్టబయలైందన్నారు.
జనసైనికులంతా తన తమ్ముళ్లని, టీడీపీ వారు ముదిరిపోయిన మొక్కజొన్న గింజలని మంత్రి కొట్టు చెప్పారు. తప్పుడు మార్గాల్లో వెళ్లవద్దని జన సైనికులకు సూచించారు. మనం శత్రువులం కాదన్నారు. లోకేష్ వంటి దద్దమ్మ సైతం పవన్‌ను లోకువ చేసి మాట్లాడుతున్నాడని ఆయన గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో ప్రస్తుతాని కంటే అదనంగా సీట్లు వైసీపీకి వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.