బీజేపీతో పొత్తు.. చంద్రబాబుపై షర్మిల ఫైర్
ఐదు సంవత్సరాలపాటు బీజేపీతో పొత్తుపెట్టుకుని కూడా ప్రజలకు న్యాయం చేయకపోయినా.. మళ్లీ అదే బీజేపీతో ఎందుకు కలుస్తున్నారని షర్మిల సూటిగా ప్రశ్నించారు.
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆదివారం ఆమె ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. పోలవరం ఇచ్చారని కలుస్తున్నారా.. ప్రత్యేక హోదా ఇచ్చారని కలుస్తున్నారా.. రాజధాని ఇచ్చారని కలుస్తున్నారా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఐదు సంవత్సరాలపాటు బీజేపీతో పొత్తుపెట్టుకుని కూడా ప్రజలకు న్యాయం చేయకపోయినా.. మళ్లీ అదే బీజేపీతో ఎందుకు కలుస్తున్నారని షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో.. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని గుర్తుచేశారు. ‘అందరూ దొంగలే..’ అంటూ ఈ సందర్భంగా షర్మిల విమర్శించారు.
ఇక పొత్తులో భాగంగా బీజేపీ–జనసేనలకు 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇందులో 6 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీతో టీడీపీ పొత్తుపై షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.