పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకోవడం అంటరానితనమే..

పాలనలో ఏ ప్రభుత్వం చేయలేని మార్పుల్ని తాము తీసుకొచ్చామని చెప్పారు సీఎం జగన్. 98.5 శాతం వాగ్దానాలను అమలు చేసిన ప్రభుత్వం కూడా తమదేనని అన్నారు.

Advertisement
Update: 2023-08-15 05:24 GMT

స్వాతంత్రం సిద్ధించి ఇన్నేళ్లవుతున్నా కూడా ఇంకా అంటరానితనం సమాజంలో ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని కొంతమంది అడ్డుపడుతున్నారని, అది అంటరానితనమేనని చెప్పారు. పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరానితనమేనన్నారు. పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం, ఇంగ్లిష్‌ మీడియం చదువుల్ని అడ్డుకోవాలని చూడటం కూడా అంటరానితనమేనన్నారు. పేదలు గెలిచే వరకు, వారి బతుకులు బాగుపడే వరకు ఆ అంటరానితనంపై యుద్ధం కొనసాగుతుందని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు.


పాలనలో ఏ ప్రభుత్వం చేయలేని మార్పుల్ని తాము తీసుకొచ్చామని చెప్పారు సీఎం జగన్. 98.5 శాతం వాగ్దానాలను అమలు చేసిన ప్రభుత్వం కూడా తమదేనని అన్నారు. నాడు-నేడు సహా విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. 45వేల స్కూళ్ల రూపురేఖలు మార్చేశామని అన్నారు జగన్.

రాష్ట్రంలో ట్రిపుల్‌ ఐటీల్లో పెండింగ్‌లో ఉన్న 3295 టీచింగ్‌ పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు జగన్. వైద్యశాఖలో 53,126 పోస్టుల భర్తీ చేస్తున్నామని, కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని చెప్పారు. పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశామని, మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశామని వివరించారు. వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామన్నారు జగన్.

సంక్షేమం-అభివృద్ధి..

వడివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయని చెప్పిన జగన్, 2025 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండలో మొదటి టన్నెల్‌ పూర్తి చేశామని, రెండో టన్నెల్‌ పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఇప్పుడు లేదని, అన్ని సేవలు ఇంటి వద్దకే తెచ్చి అందిస్తున్నామన్నారు జగన్. తాము అధికారం చేపట్టిన 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చామని, గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌ లు, డిజిటల్‌ లైబ్రరీలు తెచ్చామన్నారు. సామాజిక న్యాయం నినాదం కాదని, దాన్ని అమలు చేసి చూపామని అన్నారు. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇస్తూ 2.31 లక్షల కోట్ల రూపాయలను నేరుగా ప్రజలకు అందించామని చెప్పారు సీఎం జగన్. లంచాలు, వివక్ష లేని పాలన ప్రజలకు అందిస్తున్నామన్నారు. 

Tags:    
Advertisement

Similar News