పక్కా ఇన్ఫర్మేషన్ తో నియోజకవర్గాల రివ్యూ..

2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల టార్గెట్ పెట్టుకున్న జగన్ ఇప్పటినుంచే దానికి తగ్గ కసరత్తులు మొదలు పెట్టారు. ప్రతి రోజూ ఓ నియోజకవర్గం సమీక్ష చేస్తున్నారు.

Advertisement
Update:2022-08-06 08:07 IST

మీ నియోజకవర్గంలో అభివృద్ధి నిధుల కింద 775 కోట్ల రూపాయలిచ్చాం.

మీ నియోజకవర్గంలో 12,403మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం.

87శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందజేశాం.

సీఎం జగన్ ఈ లిస్ట్ చదువుతుంటే.. రాజాం నియోజకవర్గ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. కేవలం రాజాం మాత్రమే కాదు, అంతకు ముందు కుప్పం నియోజకవర్గ సమీక్షలో కూడా సీఎం జగన్ పక్కా ఇన్ఫర్మేషన్ తో లెక్కలన్నీ చెప్పారు. ఏ నియోజకవర్గానికి ఏమేం చేశాం, ఏమేం చేయాలనుకుంటున్నాం, లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, వారందరికీ కార్యకర్తలు చెప్పాల్సిందేంటి, చేయాల్సిందేంటి.. ఇలా దిశానిర్దేశం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల టార్గెట్ పెట్టుకున్న జగన్ ఇప్పటినుంచే దానికి తగ్గ కసరత్తులు మొదలు పెట్టారు. ప్రతి రోజూ ఓ నియోజకవర్గం సమీక్ష చేస్తున్నారు.

ఆ తేడా చెప్పాలి, చూపించాలి..

గత టీడీపీ హయాంలో ఏమేం పనులు జరిగాయి, ఇప్పుడు మన హయాంలో ఏమేం జరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పాలన్నారు సీఎం జగన్. అది చెప్పినప్పుడే, వారిని కన్విన్స్ చేయగలిగినప్పుడే మనకు మళ్లీ విజయం దక్కుతుందన్నారు. ఆ బాధ్యత తనదీ, మంత్రులదీ, ఎమ్మెల్యేలదీ కాదని.. తమకంటే ఎక్కువగా ఆ బాధ్యత కార్యకర్తలపై ఉందని హితబోధ చేశారు. ప్రజలకు చేరువయ్యేది కార్యకర్తలేనని చెప్పారు. గతంలోకంటే ఎక్కువ మెజార్టీ రావాలన్నారు.

మేనిఫెస్టో ద్వారా చేసిన వాగ్దానాల్లో 95శాతం నిలబెట్టుకున్నామని, ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ గడపగడపకూ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు జగన్. ఇవన్నీ వాస్తవాలు అయితేనే మళ్లీ జగనన్నను ఆ శీర్వదించండి అని ధైర్యంగా చెప్పండి అన్నారు. అర్హత ఉన్నవారందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని, అర్హత ఉండి కూడా ఆయా ఫలాలు అందుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా లేదని, ఈ మంచి పనిని ఓట్ల రూపంలో మార్చుకోవాలని చెప్పారు జగన్.

కమిటీలపై కసరత్తు..

పార్టీ పరంగా జిల్లా, మండలస్థాయి, గ్రామస్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు కావాలన్నారు జగన్. పార్టీకి సంబంధించి దాదాపు 24 అనుబంధ విభాగాలు ఉన్నాయని, ఈ విభాగాలన్నింటికీ నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు జగన్. ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలని, బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలన్నారు. ప్రతి కమిటీలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూసుకోవాలని, కమిటీలో 50శాతం మహిళలకు అవకాశమివ్వాలని చెప్పారు. మనమంతా ఇంకా 30 ఏళ్లు కలిసికట్టుగా రాజకీయాలు చేయాలని, జీవిత కాలం మిగిలిపోయే విధంగా మన చరిత్రను లిఖించాలని చెప్పారు జగన్.

Tags:    
Advertisement

Similar News