నొప్పింపక తానొవ్వక.. ఉమ్మడి పౌరస్మృతిపై జగన్ లాజిక్

ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ.. వైసీపీ లాంటి పార్టీల సపోర్ట్ కూడా కేంద్రానికి అవసరం. ఈ దశలో జగన్ పౌరస్మృతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2023-07-19 17:53 IST

ఉమ్మడి పౌరస్మృతికి తాము పూర్తి వ్యతిరేకంగా అంటూ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. లా కమిషన్ కు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం ముస్లిం మత పెద్దలకు వ్యూహాత్మక సమాధానమిచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ.. వైసీపీ లాంటి పార్టీల సపోర్ట్ కూడా కేంద్రానికి అవసరం. ఈ దశలో జగన్ పౌరస్మృతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, మైనార్టీ నాయకులతో సమావేశమైన సీఎం జగన్.. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తన అభిప్రాయాన్ని వారికి వివరించారు. "ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురి కావాల్సిన అవసరం లేదు" అని భరోసా ఇచ్చారు. అదే సమయంలో అసలు డ్రాఫ్ట్ కూడా రెడీ అవలేదని, అందులో ఎలాంటి అంశాలుంటాయో కూడా ఎవరికీ తెలియదని, ఈ దశలో భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు జగన్.

ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో తాను ఉన్నానని, మీరే నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో ఆలోచన చేసి సలహా ఇవ్వండి అంటూ బంతి మైనార్టీ నేతల కోర్టులోకి నెట్టేశారు సీఎం జగన్. ఈ దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నాయని.. ఆయా మత గ్రంథాలు ఆచార వ్యవహారాలకు సంబంధించి వారి పర్సనల్‌ లా బోర్డులు ఉన్నాయన్నారు. మతాలను ప్రభావితం చేసేలా కొత్త నిర్ణయాలు తీసుకురావాలనుకుంటే.. ఆయా మత సంస్థలు, పర్సనల్‌ లా బోర్డుల ద్వారానే చేయాలన్నారు జగన్. మార్పులు అవసరం అనుకుంటే, ఆ విషయంలో సుప్రీంకోర్టు, లా కమిషన్‌, కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు జగన్.

Tags:    
Advertisement

Similar News