జగన్ విన్నపాలను అమిత్ షా విన్నట్టేనా..?
చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలు కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయని అంటున్నారు. దాదాపు గంటసేపు భేటీ జరగడం విశేషం.
ఏపీ సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన పూర్తయింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి హాజరైన జగన్, అనంతరం హోం మంత్రి అమిత్ షా ని ప్రత్యేకంగా కలిశారు. రాష్ట్ర సమస్యలను మరోసారి ఏకరువు పెట్టారు. నిధుల విడుదల సహా కృష్ణా జలాలపై పొరుగు రాష్ట్రంతో వచ్చిన చిక్కులకు పరిష్కారం చూపాలని కోరారు.
అమిత్ షా కి జగన్ విన్నపాలు..
- రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
- పోలవరం ప్రాజెక్ట్ నిధులను వెంటనే విడుదల చేయాలి.
- పోలవరం పెరిగిన అంచనాలను కేంద్రం దృష్టిలో పెట్టుకోవాలి.
- కృష్ణా జలాల అంశంపై ఏపీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలి.
గంటసేపు చర్చలు..
ప్రధానంగా పోలవరం అశంపైనే అమిత్ షా తో సీఎం జగన్ చర్చించారని అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి చంద్రబాబుదే తప్పంతా అని చెబుతున్నా.. డెడ్ లైన్ల మీద డెడ్ లైన్లు పెట్టి మరీ వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబుదే తప్పు అంటే జనం నమ్మే పరిస్థితి లేదు. అందుకే పోలవరం విషయంలో నిధుల విడుదలపై అమిత్ షా ని కాస్త గట్టిగానే రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఏపీ రాజకీయాలపై కూడా అమిత్ షా, జగన్ మధ్య చర్చ జరిగి ఉంటుందనే ఊహాగానాలున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలు కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయని అంటున్నారు. దాదాపు గంటసేపు వీరిద్దరి మధ్య భేటీ జరగడం విశేషం.