జగన్ లో ఈ మార్పు దేనికి సంకేతం..?
సహజంగానే ఆయన తాడేపల్లి ప్యాలెస్ విడిచి రావడంలేదంటూ విమర్శలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో జగన్ తన స్టైల్ మార్చారు. జనంలోకి వస్తున్నారు. కేవలం నవరత్నాల విషయంలోనే కాదు, ఇతర కార్యక్రమాలకూ హాజరవుతున్నారు.
ఇటీవల ఏపీ సీఎం జగన్ పర్యటన అంటే కచ్చితంగా అది నవరత్నాల కార్యక్రమం అనుకోవాల్సిందే. లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభ అనుకోవాల్సిందే. లేదా పరిశ్రమల ప్రారంభోత్సవాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరామర్శలు ఇలాగే సాగుతున్నాయి ఆయన పర్యటనలు. గతంలో పలుమార్లు వాయిదా పడిన రచ్చబండ ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గి సానుకూల పరిస్థితులు ఉన్నా కూడా మొదలు కాలేదు. దీంతో సహజంగానే ఆయన తాడేపల్లి ప్యాలెస్ విడిచి రావడంలేదంటూ విమర్శలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో జగన్ తన స్టైల్ మార్చారు. జనంలోకి వస్తున్నారు. కేవలం నవరత్నాల విషయంలోనే కాదు, ఇతర కార్యక్రమాలకూ హాజరవుతున్నారు.
ఇటీవల ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాల ఆవిష్కరణకోసం ఆయన చీమకుర్తి వచ్చారు, అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. తాజాగా ఆయన కడప జిల్లా పర్యటన కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు రూపొందించినదే. సొంత జిల్లా కడపలోని వేల్పుల గ్రామంలో సచివాలయ కాంప్లెక్స్ ని ప్రారంభించారు జగన్. ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలను ఆయన ప్రారంభించారు. మహాత్మా గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కూడా ఆవిష్కరించారు. ముందునుంచీ ప్రచారంలో లేకపోయినా, చివరి నిముషంలో ఫిక్స్ అయిన కార్యక్రమం ఇది. మూడురోజులపాటు కడపలో ఆయన పర్యటన కొనసాగుతుంది.
రచ్చబండ మొదలు పెడతారా..?
గతంలో ప్రతిపక్ష నేతగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు జగన్ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలోనే వివిధ హామీలు ఇస్తూ మేనిఫెస్టో రూపొందించుకుంటూ ముందుకు కదిలారు. ఆ తర్వాత పాలనలో తలమునకలై మూడేళ్లుగా సరిగా జనంలోకి రాలేదు జగన్. సంక్షేమ కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టారు. బటన్ నొక్కి డబ్బు జమ చేస్తే సరిపోతుందా..? జనంలోకి వెళ్లకపోతే స్థానిక పరిస్థితులపై అవగాహన ఎలా ఉంటుందో తెలుస్తుందా..? అనే చర్చ కూడా వైసీపీలో జరిగింది. అందుకే ముందుగా ఎమ్మెల్యేలను గడప గడపకు కార్యక్రం ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నారు జగన్. సంక్షేమ కార్యక్రమాలపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నారు. స్థానిక సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పుడు నేరుగా ఆయన కూడా జనంలోకి వస్తున్నారు. ఆ విధంగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. అయితే రచ్చబండ ప్రస్తావన మాత్రం ఇప్పుడు లేదు. నేరుగా రచ్చబండ పేరుతో జగన్ జనాల్లోకి వచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతారా, లేక ఎన్నికల ఏడాదిలో మరోసారి ప్రజాబాట నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రతిపక్షాన్ని నిలువరించే దిశగా వ్యూహాలు రచిస్తున్న జగన్.. జనం నాడి పట్టేందుకే ఇప్పుడు జనంలోకి వస్తున్నారు.