వారికి రూ.10వేలు ఇవ్వండి.. జగన్ కీలక ఆదేశాలు
వరద ప్రభావిత ప్రాంతాలవారికి నిత్యావసర సరుకులు ఉదారంగా పంపిణీచేయాలన్నారు. గోదావరి వరద ప్రవాహం క్రమేణా పెరిగే అవకాశముందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం జగన్.
ఏపీ ప్రభుత్వం వరదసాయం ప్రకటించేసింది. బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉండగానే వారు తిరిగి వెళ్లేటప్పుడు ఎంతమొత్తం ఇవ్వాలనే విషయంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న ఒక్కో కుటుంబానికి 2వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తులకైతే ఒక్కొకరికి వెయ్యి రూపాయలివ్వాలన్నారు. ఇక ఇల్లు ధ్వంసం అయితే, అలాంటివారికి రూ.10వేలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో వరదలు, రెస్క్యూ ఆపరేషన్ గురించి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష నిర్వహించారు.
కచ్చితంగా రూ.10వేలు
వరదలకు కొన్నిచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాంటి సందర్భాల్లో వారు పునరావాస శిబిరాల్లో తలదాచుకోడానికి వచ్చారు. వరద బాధితులు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు రూ.10వేలు ఇచ్చి పంపించాలని సూచించారు సీఎం జగన్. కచ్చా ఇల్లు ధ్వంసమైందని గమనిస్తే కచ్చితంగా 10వేల రూపాయలు ఇవ్వాలన్నారు. ఎంతభాగం ధ్వంసమైంది..? పాక్షికంగానా లేక పూర్తిగానా అనే వర్గీకరణ వద్దన్నారు.
అల్లూరి, ఏలూరు, తూర్పు, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం జగన్. ముంపు ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా సహాయ శిబిరాలకు పంపాలన్న సీఎం, అక్కడ మంచి సదుపాయాలు కల్పించాలన్నారు. వరదల్లో దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలవారికి నిత్యావసర సరుకులు ఉదారంగా పంపిణీచేయాలన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళ దుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలన్నారు. గోదావరి వరద ప్రవాహం క్రమేణా పెరిగే అవకాశముందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం జగన్.