పోటాపోటీగా ఢిల్లీకి వెళ్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఈరోజు మంత్రి వర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు హస్తినకు బయలుదేరుతారు.

Advertisement
Update:2024-07-16 07:28 IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పాలన పక్కనపెట్టి ఆయన ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆయనకు పోటీగా చంద్రబాబు సిద్ధమయ్యారు. ఏపీ సీఎం బాబు మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీ పర్యటకు వెళ్లొచ్చారు, కీలక నేతల్ని కలసి వినతిపత్రాలు అందించారు. తక్కువ వ్యవధిలోనే రెండోసారి ఆయన పర్యటన ఆసక్తికరంగా మారింది.

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా ఇతర కీలక నేతల్ని ఆయన కలిసే అవకాశముంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈనెల 3న ఆయన తొలిసారిగా ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. ఏపీ సమస్యలను ఏకరువు పెట్టారు, బడ్జెట్ లో కేటాయింపులకోసం వినతిపత్రాలిచ్చారు. రెండు వారాల వ్యవధిలోనే ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఈరోజు మంత్రి వర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు హస్తినకు బయలుదేరుతారు.

కేంద్ర పెద్దల్ని నేరుగా కలసి విన్నవించినంత మాత్రాన పనులు జరుగుతాయనుకోలేం. ఆ రాష్ట్రంపై కేంద్రానికి శ్రద్ధ ఉంటే, ఎంపీల ఒత్తిడి ఉంటే, ఆ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అయితే కచ్చితంగా పనులు జరుగుతాయి. ఈసారి అలాంటి పరిస్థితే ఉంది. టీడీపీ మద్దతు కేంద్రంలోని బీజేపీకి తప్పనిసరిగా మారింది. చంద్రబాబు తలచుకుంటే ఈసారి ఏపీకి ప్రత్యేక హోదా గ్యారెంటీ అని ప్రతిపక్షాలు కూడా చెబుతున్న పరిస్థితులున్నాయి. మరి హోదా డిమాండ్ లేకుండానే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అంతకు మించి ఆయన రాష్ట్రానికి ఏమేం తీసుకొస్తారో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News