సీఐడీ విచారణపై తప్పుడు ప్రచారం.. ఈనాడు ఆరోపణలు అవాస్తవం
మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విచారణ చేస్తున్నామని తెలిపారు ఏపీ సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్. మార్గదర్శిలో చట్టాలు ఉల్లంఘించినట్టు ఆధారాలు దొరికాయన్నారు.
మార్గదర్శి కేసులో చట్టానికి లోబడే దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు ఏపీ సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం సీఐడీకి లేదని చెప్పారాయన. అయితే ఈ విచారణపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. ఈనాడు, ఈటీవీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పారు రవికుమార్. విచారణకు మార్గదర్శి యాజమాన్యం సరిగా స్పందించడంలేదని అన్నారాయన.
అసలేం జరిగింది..?
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో నిన్న ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్ ఇంటికి సీఐడీ బృందం వెళ్లి విచారణ చేపట్టింది. అయితే విచారణ తర్వాత ఈటీవీలో పలు కథనాలు ప్రసారమయ్యాయి. ఈనాడులో కూడా సీఐడీ తీరుని తప్పుబడుతూ కథనాలు వచ్చాయి. తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారని, విచారణ పేరుతో వేధించారని, రోజంతా విచారణ చేపట్టి కేవలం 8 ప్రశ్నలే అడిగారని, తికమక పెట్టే ప్రయత్నం చేశారంటూ సీఐడీపై ఆరోపణలు చేస్తూ కథనాలిచ్చారు. దీనిపై ఈరోజు సీఐడీ అధికారులు స్పందించారు.
ఖాతాదారుల ప్రయోజనాలే ముఖ్యం..
మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విచారణ చేస్తున్నామని తెలిపారు ఏపీ సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్. మార్గదర్శిలో చట్టాలు ఉల్లంఘించినట్టు ఆధారాలు దొరికాయన్నారు. చట్టం పరిధిలోనే విచారణ జరుపుతున్నామని, తామెక్కడా వేధించలేదని వివరణ ఇచ్చారు. భోజనం, టీ, మందులు వేసుకోడానికి అవసరమైన స్వేచ్ఛ ఇచ్చామని, మర్యాదగానే వ్యవహరించామని చెప్పారు. నిజం రాబట్టడం కోసం పారదర్శకంగా విచారణ చేస్తుంటే, వాళ్లు సమాధానం లేక చెప్పిందే చెబుతున్నారని అన్నారు.
నాలుగు ప్రశ్నల్లో ఒకదానికే జవాబు..
కేవలం 25 శాతం ప్రశ్నలకు మాత్రమే శైలజా కిరణ్ జవాబు చెప్పారని అన్నారు సీఐడీ అధికారులు. విచారణకు వెళ్లిన టీమ్ లో 10మందిని వారు వద్దన్నారని, టెక్నికల్ ఆఫీసర్స్ ని తీసుకెళ్లొద్దంటూ అభ్యంతరం తెలిపారని చెప్పారు. కొన్ని ప్రశ్నలకు ఎండీ శైలజా కిరణ్ సమాధానాలు చెప్పలేదన్నారు. విచారణకు వెళ్లిన ప్రతిసారి వంకలు పెట్టి ఆలస్యం చేస్తున్నారని చెప్పారు సీఐడీ అధికారులు. మరోసారి శైలజా కిరణ్ ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, అవసరమైతే రామోజీ రావు నుంచి కూడా కొంత సమాచారం రాబడాతమని చెప్పారు.