చంద్రబాబుపై మరో కేసు.. ఈసారి ఇసుక అక్రమాలపై
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదని కూడా విమర్శలు ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తాజాగా మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటూ ఇటీవలే.. అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో కంటికి చికిత్స చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ కేసు కొనసాగుతుండగానే.. చంద్రబాబుపై ఫైబర్ నెట్ కుంభకోణం కేసు, అమరావతి రహదారి అలైన్‌మెంట్ కేసు, మద్యం కేసు ఇలా తదితర కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయి.
తాజాగా టీడీపీ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ–1గా పీతల సుజాత, ఏ–2గా చంద్రబాబు, ఏ–3గా చింతమనేని ప్రభాకర్, ఏ–4గా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిని అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్లడం పెద్ద చర్చనీయాంశమైన విషయమూ తెలిసిందే. ఈ ఉదంతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు కూడా తీవ్ర విమర్శలకు గురైంది.