ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు.. ఏపీలో ఎన్నికలు ప్రశాంతం
మాచర్ల కేంద్రంలో ఈవీఎంలు దెబ్బతిన్నాయని, వాటిని పరిశీలించిన ఇంజినీర్లు అందులోని డేటాని తిరిగి తీసుకోవచ్చని చెప్పారన్నారు సీఈఓ ముకేష్ కుమార్ మీనా.
చెదురు మదురు సంఘటనలు జరిగినా ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా రీపోలింగ్ కి అవకాశం లేదని, ఆ అవసరం రాలేదని చెప్పారు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా. ఓటరు జాబితా విషయంలో ఈ సారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటల వరకు 68 శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు. తుది పోలింగ్ వివరాలు పరిశీలించిన తర్వాత రేపు కచ్చితమైన పోలింగ్ శాతం వెల్లడవుతుందన్నారు ముకేష్ కుమార్ మీనా.
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల దాడులు జరిగాయని, పల్నాడు, తెనాలి, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నామని చెప్పారు ముకేష్ కుమార్ మీనా. ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. ఈవీఎంలకు సంబంధించి 275 బ్యాలెట్ యూనిట్లు, 217 కంట్రోల్ యూనిట్ లు, 600 వీవీప్యాట్‌లకు సంబంధించి సమస్యలు తలెత్తాయన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 20వేల ఈవీఎంలను అదనంగా ఉంచామని, దీంతో ఎక్కడా సమస్యలు రాలేదని చెప్పారు ముకేష్ కుమార్ మీనా.
మాచర్ల కేంద్రంలో ఈవీఎంలు దెబ్బతిన్నాయని, వాటిని పరిశీలించిన ఇంజినీర్లు అందులోని డేటాని తిరిగి తీసుకోవచ్చని చెప్పారన్నారు సీఈఓ ముకేష్ కుమార్ మీనా. మాచర్ల నియోజకవర్గంలో 8 కేంద్రాల్లో ఈవీఎంలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించామన్నారు. అయితే ఏపీలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొత్తమ్మీద ఏపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటరు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.