మా విధానం వికేంద్రీకరణే.. రాజధాని మాత్రం విశాఖే

సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే పరిపాలన వైజాగ్ నుంచి మొదలవుతుందని చెప్పారు మంత్రి బుగ్గన. ఇప్పుడున్న పరిస్థితుల్లో త్వరగా అభివృద్ధి కావాలంటే వైజాగ్ మంచిదని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు.

Advertisement
Update:2023-02-16 04:45 IST

ఏపీకి ఒకటే రాజధాని, అది విశాఖేనంటూ బెంగళూరు రోడ్ షో లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై మరో మంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు, మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానం అన్నారు. బుగ్గన కూడా అదే చెప్పారుకదా, టీడీపీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో మరోసారి బుగ్గన మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలను సమర్థించుకోలేక, అదే సమయంలో మూడు రాజధానులు అని చెప్పలేక ఆయన సతమతం అయ్యారు.

సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే పరిపాలన వైజాగ్ నుంచి మొదలవుతుందని చెప్పారు మంత్రి బుగ్గన. 1920 శ్రీబాగ్ ఒప్పందం జరిగిందని, ఆ ఒప్పందం వికేంద్రీకరణకు మొగ్గు చూపిందని చెప్పారు. తెలంగాణ విషయం వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణ కమిటీ వికేంద్రీకరణకు మొగ్గు చూపిందన్నారు. శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణ మంచిదని చెప్పిందని గుర్తు చేశారు బుగ్గన. ఇప్పుడున్న పరిస్థితుల్లో త్వరగా అభివృద్ధి కావాలంటే వైజాగ్ మంచిదని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. రాయలసీమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందంటున్న ఆయన, శ్రీబాగ్ ఒప్పందం పరిగణలోకి తీసుకొని హైకోర్టు వివిధ న్యాయ ట్రిబ్యునల్స్, కమిషన్లు.. కర్నూలలో ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు మీటింగ్ లో కూడా తాను అదే చెప్పానన్నారు.

వైసీపీ విధానం ఏంటి..?

త్వరలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ప్రస్తుతం ప్రభుత్వం తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఢిల్లీ మీటింగ్ లో కూడా సీఎం జగన్, త్వరలో పరిపాలన విశాఖనుంచి మొదలవుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు బుగ్గన కూడా గ్లోబల్ సమ్మిట్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే విశాఖను హైలెట్ చేస్తున్నారు. అంటే ఒకరకంగా ఏపీకి రాజధాని విశాఖ అని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేయాలని చూస్తోంది. ఏపీకి పెట్టుబడులకోసం వచ్చే పారిశ్రామిక వేత్తలకు విశాఖ రాజధాని అని క్లారిటీ ఇస్తున్నారు. పెట్టుబడులకు విశాఖనే కేంద్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే విశాఖను హైలెట్ చేసే క్రమంలో మూడు రాజధానులనే విషయాన్ని బుగ్గన పక్కనపెట్టడమే కొత్త వివాదానికి కారణం అయింది. అందుకే ఇప్పుడు వివరణలతో నేతలు తంటాలు పడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News