మీడియా ఏప్రిల్ ఫూల్ అయిందా..? విస్తరణ లేకపోతే ఈ హడావిడి ఎందుకు..?

మంత్రి వర్గం నుంచి పోయేవారు, వచ్చేవారు అంటూ కొన్ని మీడియా ఛానెల్స్ లిస్ట్ చదివి వినిపించాయి. మరికొన్ని మీడియా సంస్థలు పోర్ట్ ఫోలియోలు కూడా ఫిక్స్ చేశాయి.

Advertisement
Update:2023-04-02 21:31 IST

ఏపీ రాజకీయాలకు సంబంధించి రెండు రోజులుగా మంత్రి వర్గ విస్తరణ గురించే చర్చ నడుస్తోంది. రెండేళ్లకోసారి మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేస్తానని చెప్పిన సీఎం జగన్, ఇప్పుడు ఎన్నికల ఏడాదికి ముందు టీమ్-3 ని రంగంలోకి దించుతున్నారని అనుకున్నారంతా. ఈ వార్తలకు బలం చేకూర్చేలా మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్ భేటీ ఆసక్తికరంగా మారింది. ఆ భేటీ తర్వాత తనకు మంత్రి పదవి ఉన్నా లేకున్నా ఒకటేనంటూ అప్పలరాజు వేదాంతం మాట్లాడే సరికి ఆయన పోస్ట్ ఊడిపోయిందని అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాంకి బెర్త్ ఖరారైందని కూడా అన్నారు. మంత్రి వర్గం నుంచి పోయేవారు, వచ్చేవారు అంటూ కొన్ని మీడియా ఛానెల్స్ లిస్ట్ చదివి వినిపించాయి. మరికొన్ని మీడియా సంస్థలు పోర్ట్ ఫోలియోలు కూడా ఫిక్స్ చేశాయి. ఇంతా జరిగాక ఇప్పుడు వైసీపీ నేతలు తూచ్ అంటున్నారు. అసలు మంత్రి వర్గ విస్తరణే లేదు, అదంతా మీడియా సృష్టే అని చెప్పారు. అసలిందులో ఏది నిజం..? ఎంత నిజం..? ఎమ్మెల్యేలతో జరగబోతున్న జగన్ మీటింగ్ లో పూర్తిగా క్లారిటీ రాకపోయినా, మరికొన్ని రోజుల్లో మాత్రం నిజానిజాలు తేలిపోతాయి.

మంత్రి వర్గ విస్తరణ వట్టిదేనంటూ మాజీ మంత్రులు పేర్ని నాని, బాలినేని శ్రీనివాసులరెడ్డి కుండబద్దలు కొట్టారు. విచిత్రం ఏంటంటే.. రెండురోజులుగా మీడియా చదువుతున్న లిస్ట్ లో వీరిద్దరి పేర్లు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ లో పేర్లు ఉండబట్టే వీరు హడావిడిగా బయటకొచ్చి విస్తరణపై మాట్లాడారా, లేక నిజంగానే ఎమ్మెల్యేలకు ఆమేరకు సమాచారం ఉందా అనేది తేలాల్సి ఉంది.

సోమవారం ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం జగన్. మంత్రి వర్గ విస్తరణ సమాచారం, వచ్చే ఎన్నికల్లో టికెట్లు కోల్పోయేవారి లిస్ట్, అసెంబ్లీ రద్దు చేయడం.. ఈమూడింటిలో ఏదో ఒకటి మాత్రం గ్యారెంటీ అనే విశ్లేషణలు వినపడుతున్నాయి. అసలు ఈ మూడింటిలో ఏది నిజం, ఎంతవరకు నిజమనేది జగన్ నోటివెంటే బయటకు రావాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News