పాపం పురందేశ్వరి.. ఏపీలో పొత్తుల గురించి ఎన్నాళ్లూ పాతపాటేనా..?
నిజానికి టీడీపీతో పొత్తు గురించి పురందేశ్వరికి ఏమీ తెలియకపోవచ్చు. కానీ పొత్తుండాలని ఆమె నూటికి నూటయాభై పాళ్లు కోరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.
బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుంది.. టీడీపీతో పొత్తు గురించి అధిష్టానం చూసుకుంటుంది.. ఈ డైలాగ్ ఎవరిదో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. ఎందుకంటే.. అది బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ట్రేడ్ మార్కు డైలాగ్.. ఆవిడ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వారానికి రెండు మూడుసార్లయినా ఈ మాట ప్రెస్‌మీట్‌లోనో, ప్రెస్‌నోట్‌లోనే ఎక్కడో చోట చెబుతూనే ఉన్నారు. విషయమేమిటంటే.. ఆవిడకు రాష్ట్రంలో బీజేపీ పొత్తుల గురించి అంతకు మించి ఒక్క ముక్క కూడా తెలియకపోవడమే!
సామాన్య కార్యకర్తనడిగినా అదే చెబుతారుగా!
జనసేన, బీజేపీ చాలాకాలంగా కలిసే ఉన్నాయి. బీజేపీలో ఎవరు అధ్యక్ష పదవిలో ఉన్నా జనసేనానిని గౌరవంగానే చూస్తారు. ఇక్కడే కాదు పట్టుమని పదివేల ఓట్లు తెచ్చుకోలేని తెలంగాణలో కూడా బీజేపీ అగ్రనేతలంతా పవన్ కల్యాణ్‌కు మంచి గౌరవమే ఇస్తారు. మిత్రపక్షంగానే మసులుకుంటారు. కాబట్టి బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీలో సామాన్యకార్యకర్తను అడిగినా చెబుతారు. ఇక ఇందులో పార్టీ స్టేట్ చీఫ్‌గా పురందేశ్వరిచెప్పేదేముందట అని కామెంట్లు వస్తున్నాయి.
టీడీపీతో పొత్తు గురించి మాట్లాడితే బంధాలు బయటపడతాయని భయమా?
నిజానికి టీడీపీతో పొత్తు గురించి పురందేశ్వరికి ఏమీ తెలియకపోవచ్చు. కానీ పొత్తుండాలని ఆమె నూటికి నూటయాభై పాళ్లు కోరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ని చేయడం అనే ఎపిసోడ్ ముగిసిపోయాక చాన్నాళ్లుగా చంద్రబాబుకు దూరంగా ఉన్న పురందేశ్వరికుటుంబం మొన్న ఆయన అరెస్టు తర్వాత దగ్గరయిన సంగతి అందరికీ తెలుసు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దర్శనం కోసం పదిరోజులకుపైగా పడిగాపులు పడిన లోకేశ్‌బాబుకు షా అపాయింట్‌మెంట్ ఇప్పించింది ఆయన పెద్దమ్మ పురందేశ్వరినని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి.
మరిదిగారి పార్టీకోసమే ప్రకటనలు!
టీడీపీ అధ్యక్షుడితో కుటుంబ బాంధవ్యాలు మళ్లీ పునరుద్ధరించుకుంటున్న చిన్నమ్మ.. టీడీపీతో పొత్తు గురించి తాను ఆత్రుతపడుతున్నట్లు కనిపిస్తే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నట్లున్నారు. అందుకే టీడీపీతో పొత్తు గురించి అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ముక్తాయిస్తున్నారు. కానీ, పొత్తు గురించి మాత్రం నిత్యం మీడియాతో మాట్లాడుతూ మరిదిగారి పార్టీకి మేలు చేసే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.