పురందేశ్వరి అక్కసు బయటపడిందా?

కేంద్రానికి ఎందుకు మద్దతిస్తోందో వైసీపీనే అడగాలని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. సభా నిర్వహణకు, ఫ్లోర్ మేనేజ్మెంట్‌కు అసలు సంబంధమే లేదని చెప్పారు.

Advertisement
Update:2023-08-10 10:27 IST

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలోని అక్కసంతా బయటపడింది. అధ్యక్షురాలిగా నియమించే ముందు బీజేపీ అగ్రనేతలు పురందేశ్వరికి ఏమి చెప్పారో తెలీదు. అయితే పురందేశ్వరి వైసీపీని మాత్రమే పదేపదే టార్గెట్ చేస్తున్న విషయం అర్థ‌మైపోతోంది. ఒక్క విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా కానీ లేదా టీడీపీని తప్పుపడుతూ కానీ మాట్లాడింది లేదు. దీంతోనే ఆమె టార్గెట్ అంతా కేవలం జగన్ మాత్రమే అని అర్థ‌మైపోతోంది.

ఎల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేంద్రానికి ఎందుకు మద్దతిస్తోందో వైసీపీనే అడగాలని చెప్పారు. సభా నిర్వహణకు, ఫ్లోర్ మేనేజ్మెంట్‌కు అసలు సంబంధమే లేదన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో వైసీపీకి సన్నిహిత సంబంధాలుంటే రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించగలమా? అని అమాయకంగా ఎదురు ప్రశ్నించారు. అంటే బీజేపీ అగ్రనాయకత్వానికి వైసీపీ నాయకత్వానికి సన్నిహితం లేదని ఆమె చెప్పదలచుకున్నారు.

ఇక్కడే జగన్ అంటే ఆమెలో ఎంత అక్కసు పేరుకుపోయిందో తెలుస్తోంది. అవసరమొచ్చినప్పుడల్లా కేంద్రానికి జగన్ ఎందుకు మద్దతిస్తున్నారో పురందేశ్వరికి తెలీదా? బలం లేకపోయినా రాజ్యసభలో బిల్లులు ఎలా గట్టెక్కుతున్నాయి? మోడీ లేదా అమిత్ షా అడక్కుండానే జగన్ మద్దతిస్తున్నారా? మద్దతు అడగటం, ఇవ్వటమన్నది నరేంద్రమోడీ-జగన్ మధ్య వ్యవహారం. ఆ విషయం పురందేశ్వరికి తెలియాల్సిన అవసరమే లేదు. కేంద్రానికి మద్దతు ఇవ్వమని అడిగుంటారు కాబట్టే జగన్ మద్దతిస్తున్నారంతే. నరేంద్రమోడీ, జగన్ మధ్య మంచి సంబంధాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి పోలవరం నిధులు, రెవెన్యూ లోటు తదితరాలు రావటాన్ని కూడా పురందేశ్వరి తట్టుకోలేకపోతున్నట్లే ఉంది.

కేంద్రానికి ఎందుకు మద్దతిస్తోందో వైసీపీనే అడగాలని చెప్పిన పురందేశ్వరి మరి టీడీపీ ఎందుకు మద్దతిస్తోందో చెప్పగలరా? పోలవరం నిర్మాణంలో జగన్ ఫెయిలయ్యారు కాబట్టి వెంటనే ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేయటం ఆశ్చర్యంగానే ఉంది. జగన్ ఫెయిలయ్యారనే అనుకుంటే మరి అంతకుముందు చంద్రబాబు కూడా ఫెయిలయ్యారు కదా. అప్పుడు ప్రాజెక్టును కేంద్రానికి ఇచ్చేయాలన్న డిమాండ్ ఎందుకు చేయలేదు? ఇంతకుముందు సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైసీపీ, టీడీపీ రెండూ ప్రత్యర్థి పార్టీలే అని చెప్పేవారు. కానీ ఇప్పుడు వైసీపీ మాత్రమే ప్రత్యర్థి పార్టీ అన్నట్లుగా పురందేశ్వరి మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News