ఏపీలో కాపు రాజకీయాన్ని బీజేపీ పక్కన పెట్టేసిందా..?

ఏపీలో ఎంట్రీ ఇస్తున్న బీఆర్ఎస్ కూడా కాపులకు సముచిత స్థానం ఇస్తోంది. ఆ వర్గాన్ని బాగా దగ్గరకు తీస్తోంది. ఈ దశలో ఇక కాపు రాజకీయం వృథా అని అనుకుంటోంది బీజేపీ.

Advertisement
Update:2023-03-11 09:59 IST

దేశవ్యాప్తంగా బీజేపీ మత రాజకీయాలనే నమ్ముకుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆల్రడీ ఓటర్లు కులాల వారీగా చీలిపోయి ఉన్నారు. ఇక్కడ మత రాజకీయం పెద్దగా వర్కవుట్ కాదు. రెండు ప్రధాన సామాజిక వర్గాలు రెండు ప్రాంతీయ పార్టీలకు అండగా ఉన్నాయి. ఇక అధికారం కోసం ఎదురు చూస్తున్న మూడో సామాజిక వర్గానికి సరైన అవకాశం దొరకడంలేదు.

కాపులను ఏకం చేయాలనుకున్న చిరంజీవికి అది సాధ్యం కాలేదు, పవన్ కల్యాణ్ జనసేనతో కూడా కాపులు ఏకమయ్యే ఛాన్స్ లు కనిపించడంలేదు. మధ్యలో బీజేపీ కూడా కాపులకే ప్రాధాన్య పదవులు ఇస్తూ తమవైపు తిప్పుకోవాలని ఇన్నాళ్లూ వేచి చూసింది. ఇప్పుడు కాపు రాజకీయాన్ని బీజేపీ పక్కనపెట్టేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినపడుతున్నాయి.


కిరణ్ ని బీజేపీలో చేర్చుకుని ఏపీలో కీలక పదవి అప్పగించే యోచనలో అధిష్టానం ఉందట. అంటే వైసీపీకి అండగా నిలబడిన సామాజిక వర్గంలో కాస్తో కూస్తో చీలక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టే అనుకోవాలి.

ఏపీలో ఎంట్రీ ఇస్తున్న బీఆర్ఎస్ కూడా కాపులకు సముచిత స్థానం ఇస్తోంది. ఆ వర్గాన్ని బాగా దగ్గరకు తీస్తోంది. ఈ దశలో ఇక కాపు రాజకీయం వృథా అని అనుకుంటోంది బీజేపీ. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీకి అధిష్టానం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి భారీ హామీ ఇచ్చి మరీ ఆయనలో కదలిక తెస్తోంది.

సడన్ గా ఏంటి..?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగి చాలా కాలమైంది. ఆయనకేం వయసైపోలేదు, పోనీ మరో వ్యాపకంలో ఉన్నారా అంటే అదీ లేదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత పక్క పార్టీల్లో చేరి ఇబ్బందులు పడటం ఎందుకని సైలెంట్ గా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ కి కనుచూపు మేరలో భవిష్యత్తు లేదని తేలిపోయింది. ఈ దశలో కిరణ్ కుమార్ రెడ్డికి కూడా బీజేపీ వంటి ప్రత్యామ్నాయం అవసరం.

అందుకే ఆయనవైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పోస్ట్ కోసం ఆయన ఎదురు చూస్తున్నట్టు సమాచారం. మరి బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చి సరిపెడుతుందా, నిజంగానే కిరణ్ కుమార్ రెడ్డికి సముచిత స్థానం కట్టబెడుతుందా అనేది వేచి చూడాలి. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో కీలకం అయితే, ప్రస్తుతం టీడీపీలో ఉన్న కిరణ్ తమ్ముడు కిషోర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News