రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ.. టీడీపీకి చేతినిండా పని
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించారు.
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే కేబినెట్ భేటీ అయి అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసింది. పలు బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రతిపక్షనేత చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా అసలు టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా లేదా అనే అనుమానం అందరిలో ఉంది. ఆ అనుమానాలు తొలగిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి హాజరు కావాలంటూ ఆ పార్టీ శాసన సభాపక్షం నిర్ణయించింది.
జూమ్ కాన్ఫరెన్స్..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఇక్కడ ఏపీలో ఉన్నారు. వీరంతా జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించారు.
రచ్చ రచ్చే..
అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందని చంద్రబాబు మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న సంఘటన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు సరిగా సమావేశాలకు హాజరు కావడంలేదు. చంద్రబాబు కూడా సభలో అడుగుపెట్టకపోవడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా సభకు వచ్చి, అలా సస్పెన్షన్ వేటు వేయించుకుని బయటకు వచ్చేవారు. మరి ఈ దఫా చర్చల్లో ఎలాంటి సన్నివేశాలు జరుగుతాయో చూడాలి. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలేవీ కనపడటంలేదు, వచ్చినా ఆయన అసెంబ్లీకి వస్తారన్న గ్యారెంటీ లేదు. లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఈ దశలో అసెంబ్లీలో టీడీపీని నడిపించేది ఎవరో తేలాల్సి ఉంది.
పోరాటమే అజెండాగా పెట్టుకున్నప్పుడు ప్రజల కోసం ఎన్ని అవమానాలైన భరిద్దామని జూమ్ మీటింగ్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చెప్పారు నారా లోకేష్. చంద్రబాబు అరెస్ట్ తో పాటు వివిధ ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు చట్టసభల వేదికగా ఉన్న అవకాశాన్ని వదులుకోకూడదని అన్నారాయన. అందుకే సమావేశాలకు హాజరుకావాలని హితబోధ చేశారు. సభలో చేయాల్సిన పోరాటం సభలో.. వీధుల్లో చేయాల్సి పోరాటం వీధుల్లో చేద్దామని పిలుపునిచ్చారు లోకేష్. మొత్తమ్మీద ఉభయ సభల్లో గొడవలతో మీడియాలో హైలైట్ కావాలని టీడీపీ నేతలు బలంగా ఫిక్స్ అయ్యారు.
♦