మూడు రోజుల ముందుగానే ఏపీ అసెంబ్లీ..
టీడీపీలో సీనియర్ నాయకుడైన బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల విషయంలో మళ్లీ మార్పు జరిగింది. ముందుగా ఈనెల 19న సమావేశాలు జరుగుతాయని అనుకున్నారు. ఆ తర్వాత 24వతేదీ నుంచి మూడు రోజులపాటు సమావేశాలుంటాయని అధికారిక ప్రకటన విడుదలైంది, తీరా ఇప్పుడు సమావేశాలను 21వతేదీ నుంచి మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. 21వతేదీతో మొదలై కేవలం రెండు రోజులపాటు సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఏపీ అసెంబ్లీ ఈనెల 21, 22 తేదీల్లో సమావేశమవుతుందని తెలిపింది.
ప్రమాణ స్వీకార ఘట్టం..
అసెంబ్లీ తొలి సమావేశాలు సహజంగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార ఘట్టం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికతో ముగుస్తాయి. దీనికోసం రెండు లేదా మూడు రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టం కోసం ప్రొటెం స్పీకర్ ని ఎన్నుకుంటారు. టీడీపీలో సీనియర్ నాయకుడైన బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు.
వైసీపీ మీటింగ్..?
ఈనెల 19న జగన్ పులివెందుల పర్యటనకు వెళ్తారు. తిరిగి 21న తాడేపల్లికి చేరుకుంటారు. 22వతేదీన వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులందరితో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ముందుకు జరగడంతో జగన్ టూర్ పై ఆ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 21, 22 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ సహా ఆ పార్టీ తరపున గెలిచిన 11మంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలి. మరి జగన్ టూర్, నేతల మీటింగ్ కి సంబంధించి షెడ్యూల్ మారుతుందేమో చూడాలి.