24నుంచి ఏపీ అసెంబ్లీ.. సభా సమరం ఆసక్తికరం
24న ప్రొటెం స్పీకర్ ని ఎన్నుకుంటారు. ఆయన నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ని ఎన్నుకుంటారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఏపీ అసెంబ్లీ సమావేశం కాబోతోంది. వాస్తవానికి ఈనెల 19నుంచి సమావేశాలు జరుగుతాయని అనుకున్నా.. అవి మరో ఐదురోజులు వెనక్కి వెళ్లాయి. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయని అధికారిక సమాచారం. 24, 25, 26 తేదీల్లో సమావేశాలు జరుగుతాయి. లాంఛనంగా జరిగే తొలి సమావేశాలే అయినా ఈసారి మాత్రం ఇవి మరింత ఆసక్తికరం కాబోతున్నాయి.
మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానంటూ ఛాలెంజ్ చేసిన చంద్రబాబు.. అన్నట్టుగానే సీఎంగా సభకు రాబోతున్నారు. ఇక గతంలో 151 ప్లస్ 5 సంఖ్యా బలం ఉన్న వైసీపీ ఈసారి 11 సీట్లలోనే కూర్చోబోతోంది. 24న ప్రొటెం స్పీకర్ ని ఎన్నుకుంటారు. ఆయన నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ని ఎన్నుకుంటారు.
తొలి సమావేశాలకు సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసేందుకు వస్తారు. అత్యవసర పనులున్న వారు మాత్రం అనుమతి తీసుకుని తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. టీడీపీ కొత్త హుషారుతో సభలో అడుగుపెడుతుంది. వైసీపీ నేతలు తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నవేళ.. తొలిరోజు సమావేశాల్లో వారు తమ నిరసనను పరోక్షంగా తెలియజేస్తారా లేదా అనేది వేచి చూడాలి. సమావేశాలకు ముందు ఈనెల 19న ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులందరితో జగన్ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించే అవకాశం ఉంది.