లోకేష్ పాదయాత్రపై క్లారిటీ లేదు.. బాబు నిబంధనలు ఉల్లంఘించారు.. - ఏపీ అడిషనల్ డీజీపీ
ర్యాలీలు మీటింగ్స్ బ్యాన్ చేశారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.. బ్యాన్ అనే మాటే లేదని స్పష్టం చేశారు. లోకేష్ పాదయాత్రపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేము అని చెప్పారు.
బహిరంగ సభలు, రోడ్ షో లను కట్టడి చేసేందుకు జీఓ నంబర్. 1ను ప్రభుత్వం తీసుకువచ్చింది అనే ఆరోపణల్లో నిజం లేదన్నారు ఏపీ అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యన్నార్. జీవోపై వస్తున్న ఆరోపణలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొన్ని కీలక ప్రాంతాల్లో మాత్రమే వీటిని నియంత్రించాలని చెప్పామన్నారు. హైవే లపై పబ్లిక్ మీటింగ్స్ పెట్టకూడదు అని సూచించామన్నారు. జీఓ లో పబ్లిక్ రోడ్స్ నుంచి దూరంగా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో పోలీసుల సూచనల మేరకు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవచ్చని ఉందన్నారు. బహిరంగ సభలు, రోడ్ షోకు పోలీసులకు అనుమతి అడిగితే పోలీసులు పరిశీలించి అనుమతి ఇస్తారని చెప్పారు.
జనసేన పార్టీ శ్రీకాకుళంలో పెట్టే మీటింగ్ కి అనుమతి కూడా ఇచ్చామన్నారు. ఇటీవల కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలు నేపథ్యంలోనే జీఓ నంబర్. 1 జారీ అయిందన్నారు. పోలీసుల నిబంధనలు పాటించి బహిరంగ సభలు, రోడ్ షో లు పెట్టుకోవచ్చని తెలిపారు. చంద్రబాబు కుప్పం పర్యటన లో నిబంధనలు అన్నీ పాటించలేదని, కనీసం రెండు నిబంధనలు పాటిస్తే అనుమతి ఇస్తామని చంద్రబాబు, పార్టీ నేతలకు పలమనేరు పోలీసులు చెప్పినా వినిపించుకోలేదన్నారు.
ర్యాలీలు మీటింగ్స్ బ్యాన్ చేశారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.. బ్యాన్ అనే మాటే లేదని స్పష్టం చేశారు. లోకేష్ పాదయాత్రపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేము అని చెప్పారు. పాదయాత్రకి సంబంధించి సంబంధిత జిల్లాల్లో పర్యటన వివరాలు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల బట్టి పోలీసుల అనుమతి ఇస్తారు అని స్పష్టం చేశారు. ఎవరికైనా ఈ నిభందనలు వర్తిస్తాయన్నారు.