టీడీపీకి మరో షాక్.. - వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
స్వామిదాస్‌తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైసీపీలో చేరారు. స్వామిదాస్ 1994, 99లో వరుసగా రెండుసార్లు టీడీపీ తరఫున తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరగా, ఆయన నియోజకవర్గ పరిధిలోని తిరువూరు నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కూడా ఆయన బాటలోనే నడిచారు. గురువారం సాయంత్రం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆయన్ని వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్వామిదాస్‌తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైసీపీలో చేరారు. స్వామిదాస్ 1994, 99లో వరుసగా రెండుసార్లు టీడీపీ తరఫున తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వైసీపీలో చేరిక అనంతరం స్వామిదాస్ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబులో మానవత్వం మచ్చుకైనా లేదని, ఆయన ఎవరితోనూ మానవత్వంతో వ్యవహరించరని చెప్పారు. అవసరం లేకపోతే ఆయన ఎవరినీ పట్టించుకోరని తెలిపారు. తాను దాదాపు 30 ఏళ్లుగా టీడీపీలో పనిచేస్తున్నానని, అయినా తనను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన భార్య కలిసి పది రోజులపాటు చంద్రబాబు ఇంటిముందు ఎదురుచూసినా ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. టీడీపీ నేతలే తమకు వెన్నుపోటు పొడిచారని ఆయన తెలిపారు. ఇక వైసీపీలో చేరడానికి ప్రధాన కారణం.. దళితులకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యత, సంక్షేమ పథకాలు అందించడంలో చూపుతున్న శ్రద్ధ అని వివరించారు. రానున్న రోజుల్లో వైసీపీ అభివృద్ధి కోసం సీఎం జగన్ ఏం చెబితే అది చేయడానికి తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.