మైలవరంలో చంద్రబాబుకు మరో షాక్..
చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దేవినేని ఉమాకు ఇప్పుడు బొమ్మసాని సుబ్బారావు తోడయ్యారు. మైలవరం నియోజకవర్గంలో ఈ ఇద్దరు నేతలు గతంలో కత్తులు దూసుకున్నవారే.
మైలవరం నియోజకవర్గంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు మైలవరం టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అది ఏ మాత్రం మింగుడు పడని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దాదాపుగా తిరుగుబాటు బావుటా ఎగరేశారు. దేవినేని ఉమాతో చంద్రబాబు సమావేశమై పెనమలూరు నుంచి పోటీ చేయాల్సిందిగా సూచించారు. అయితే, అందుకు దేవినేని ఉమా ఇష్టపడడం లేదు. అక్కడ బోడే ప్రసాద్ సహకారం లభిస్తుందనే నమ్మకం ఆయనకు లేదు.
చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దేవినేని ఉమాకు ఇప్పుడు బొమ్మసాని సుబ్బారావు తోడయ్యారు. మైలవరం నియోజకవర్గంలో ఈ ఇద్దరు నేతలు గతంలో కత్తులు దూసుకున్నవారే. అయితే, వసంత కృష్ణప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలనే చంద్రబాబు నిర్ణయాన్ని బొమ్మసాని కూడా వ్యతిరేకిస్తున్నారు. తాము విడివిడిగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి బదులు ఒక్కటైతే గొంతు పెరుగుతుందని కావచ్చు, ఇప్పుడు ఇద్దరూ ఒక్కటయ్యారు.
దేవినేని ఉమాకు బొమ్మసాని తోడు రావడంతో మైలవరంలో సమస్య మరింత జటిలమైంది. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ గెలుస్తాడనే నమ్మకం సడలిపోయింది. ఇది చంద్రబాబుకు పెద్ద సవాల్. చంద్రబాబు దిగిరాకపోతే దేవినేని ఉమా, బొమ్మసాని టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారా అనేది చూడాల్సి ఉంది.