ఏపీ శాప్‌లో మరో వివాదం.. ఖండించిన బైరెడ్డి

క్రీడా మైదానాల అభివృద్ధికి ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని.. సీఎం కప్‌ టోర్నమెంట్ నిర్వాహణకు కూడా ఎండీ ఆసక్తి చూపడం లేదని పాలక వర్గ సభ్యులు ఆరోపించారు.

Advertisement
Update:2023-02-08 07:41 IST

ఏపీ శాప్‌లో మరో వివాదం తలెత్తింది. ఈసారి ఎండీ ప్రభాకర్ రెడ్డిపై శాప్‌ పాలకవర్గ సభ్యులే ఆరోపణలకు దిగారు. ఇప్పటికే శాప్‌లో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు క్రీడాకారిణులు ఆరోపించారు. ఆ ఆరోపణలపై ఏపీ మహిళా కమిషన్ కూడా స్పందించింది. తాజాగా క్రీడా పరికరాల కొనుగోలులో ఎండీ ప్రభాకర్ రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారంటూ పాలకవర్గ సభ్యులు మీడియాకు ఎక్కారు. ఆ తర్వాత ఈ ఆరోపణలపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, ఎండీ ప్రభాకర్ రెడ్డి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.

ఎండీ ప్రభాకర్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని.. పాలక వర్గ సభ్యుల సలహాలను లెక్క చేయడం లేదని సభ్యులు మీడియా ముందు ఆరోపించారు. క్రీడా పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. అనర్హులకు స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లు ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి నిర్ణయాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

క్రీడా మైదానాల అభివృద్ధికి ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని.. సీఎం కప్‌ టోర్నమెంట్ నిర్వాహణకు కూడా ఎండీ ఆసక్తి చూపడం లేదని పాలక వర్గ సభ్యులు ఆరోపించారు. మొత్తం నలుగురు డైరెక్టర్లు.. ఎండీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చారు.

ఎలాంటి చెల్లింపులు జరగలేదు- శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

''ఆధారాలు ఇస్తే మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. హాకీ స్టిక్స్ టెండర్ల విషయంలో అవినీతి జరిగిందని సభ్యులు ఆరోపించారు. డాక్యుమెంట్లు పరిశీలించాం. ఆ వచ్చిన హాకీ స్టిక్స్‌ను జనవరిలోనే వెనక్కు పంపించాం. ఎలాంటి చెల్లింపులు జరగలేదు. రేట్లు ఎక్కువగా ఉండటంతో వెనక్కు పంపాం. ఇక్కడ సమన్వయ లోపం స్పష్టంగా ఉంది. కో- ఆర్డినేషన్ ఉంటే ఇలాంటి సమస్యలు రావు. నాపై చేసిన ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు చూపిస్తే ఇప్పుడే సమాధానం చెబుతా. నా నుంచి సభ్యులకు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలి. అవినీతి జరిగిందని మాటలు చెప్పడం కాకుండా స్పష్టంగా ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలి''.

టెండరే రద్దు చేశాం.. ఇక అవినీతి ఎక్కడ?- ఎండీ

పాలకవర్గ సభ్యులు చేసిన ఆరోపణలను ఎండీ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. క్రీడా పరికరాల కోసం పిలిచిన టెండర్‌లో అధిక ధరకు కోట్ చేశారని.. దాంతో ఆ టెండర్‌నే రద్దు చేశామన్నారు. టెండరే రద్దు అయిన తర్వాత అవినీతి జరిగిందని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల జారీలో గతం కంటే ఇప్పుడు నిబంధనలకు కఠినతరం చేశామన్నారు. శాప్‌లో లైంగిక వేధింపులపై ఆధారాలు ఉంటే ఇవ్వాలన్నారు.

మొత్తం మీద శాప్‌లో ఎండీ, చైర్మన్, పాలకవర్గ సభ్యులకు మధ్య కో- ఆర్డినేషన్, పరస్పర విశ్వాసం లేకపోవడం వల్లనే అక్కడి వ్యవహారాలను ఒకరికొకరు బయటపెట్టుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News