విజయనగరం రైలు ప్రమాదంలో భారీగా మృతులు..?
ఆదివారం రాత్రి విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న విశాఖపట్నం-పలాస రైలును.. కొద్దినిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ రైలు వెనుక నుంచి ఢీ కొట్టింది.
విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. దాదాపు వందమందికిపైగా గాయాలైనట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రమాదంలో రాయగడ ఇంజిన్‌లోని ఇద్దరు లోకోపైలెట్లు, పలాస ట్రైన్ గార్డ్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో పలాస, రాయగడ ప్యాసింజర్ రైళ్లలో దాదాపు 1400 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయనగరం-కొత్తవలస ప్రధాన రహదారికి ప్రమాదం జరిగిన స్థలం 5 కిలోమీటర్లు ఉండటంతో సహాయకచర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. క్షతగాత్రులను తరలించడానికి రైల్వే ట్రాక్‌పై కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీవ్రగాయాలపాలైన వారిని విశాఖ KGHకు, స్వల్పంగా గాయపడిన వారిని విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆదివారం రాత్రి విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న విశాఖపట్నం-పలాస రైలును.. కొద్దినిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ రైలు వెనుక నుంచి ఢీ కొట్టింది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమడ దగ్గరకు రాగానే సిగ్నల్ కోసం పలాస ప్యాసింజర్ పట్టాలపై నెమ్మదిగా వెళ్తూ 848 కిలోమీటర్ దగ్గర ట్రాక్‌పై ఆగింది. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు ఢీ కొట్టినట్లు ప్రయాణికులు చెప్తున్నారు. ప్రమాదంలో రాయగడ రైల్లోని 4 బోగీలు నుజ్జునుజ్జు కాగా.. మరికొన్ని పట్టాలు తప్పాయి. పక్కనే వెళ్తున్న గూడ్స్ ట్రైన్‌పైకి మరికొన్ని బోగీలు దూసుకెళ్లాయి. ఈ ఏడాది జూన్‌లో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం తరహాలోనే ఈ ప్రమాదం కూడా జరిగింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో దాదాపు 296 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రమాదం కారణంగా ఈ మార్గంలో ఇవాళ పలు రైళ్లు రద్దయ్యాయి. కోర్బా-విశాఖపట్నం, పారదీప్-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్, విజయనగరం-విశాఖ రైళ్లు రద్దయ్యాయి. ఇక రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సీఎం జగన్ సైతం ప్రమాదంలో చనిపోయిన ఏపీకి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల సాయం అందిస్తామన్నారు.