అంగన్‌వాడీలతో చర్చలు సఫలం.. - సమ్మె విరమణ

మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు.

Advertisement
Update:2024-01-23 08:14 IST

అంగన్‌వాడీల సమ్మెకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలతో జరిపిన చర్చలు సఫలమవడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు చేపట్టిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నట్టు ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్‌ అధికారుల సమక్షంలో ఈ చర్చలు నిర్వహించారు.

సచివాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం.. అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలను వర్కర్లకు రూ.50 వేల నుంచి ఏకంగా రూ.1.20 లక్షలకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతున్నామని వివరించారు. అందరు ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు, ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నామని తెలిపారు.

కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్‌ చేస్తామని బొత్స చెప్పారు. అంగన్‌వాడీల్లో పని చేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. గ్రాట్యుటీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వారిచ్చేది నేరుగా అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని నియమిస్తామని తెలిపారు. సమ్మె కాలంలోని అంగన్‌వాడీల వేతనం, పోలీసుల కేసుల అంశం సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఇన్ని డిమాండ్లను అంగీకరించడం అంటే అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మల సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని మంత్రి తెలిపారు.

మంగళవారం నుంచి విధుల్లోకి వెళుతున్నాం..

ప్రభుత్వంతో చర్చలు సఫలమవడంతో తాము మంగళవారం నుంచి విధుల్లోకి వెళుతున్నామని అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు ప్రకటించారు. వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలిక పోరాటానికి పరిష్కారం లభించిందన్నారు. అంగన్‌వాడీలకు ప్రత్యేకంగా వైఎస్సార్‌ బీమా, అంగన్వాడీల బీమా అమలు చేస్తామనడం సంతోషంగా ఉందని చెప్పారు. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడానికి చర్యలు చేపడతామనడం ఆనందాన్నిస్తోందన్నారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ బిల్లులు, గ్యాస్‌ మెనూ పెంపు, చిన్నారులు మెనూ పెంచాలని కోరగా ప్రత్యేక కమిటీలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారన్నారు. ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి, గౌరవాధ్యక్షురాలు మంజుల, వీఆర్‌ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News