కుప్పంతో మొదలు.. కొత్త సంప్రదాయానికి తెర తీసిన జగన్

ఏసీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు.

Advertisement
Update:2022-08-03 19:46 IST

ఏసీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇప్పటి వరకు ఏ సీఎం చేయని విధంగా.. పార్టీ కార్యకర్తలతో భేటీ నిర్వహించి సమీక్ష చేయనున్నారు. పార్టీ అధినేత సమీక్షలు చేయడం సాధారణమే అయినా.. అధికారంలో ఉండి, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కార్యకర్తల స్థాయి సమీక్షలు చేయడం ఇదే తొలి సారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి గురించి నివేదికలు తెప్పించుకోవడమే తప్ప.. కార్యకర్తల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోలేదు. అంతే కాకుండా పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడిన తమను.. తర్వాత పక్కకు పెట్టారనే భావన కూడా కొంత మందిలో ఉన్నది. ఈ నేపథ్యంలో అగస్టు 4 నుంచి ప్రతీ నియోజకవర్గంలోని క్రియాశీల కార్యకర్తలతో భేటీ నిర్వహిస్తానని సీఎం జగన్ ప్రకటించారు.

ఇప్పటి వరకు పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక పోస్టుల్లో ఉన్న వారితోనే భేటీ అయిన జగన్.. ఇక సరికొత్తగా సమీక్షకు రేపటి నుంచి తెరలేపుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని పదే పదే జగన్ చెప్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంను ఎలాగైనా ఈ సారి వైసీపీ ఖాతాలో వేయాలని జగన్ లక్ష్యంగా పెట్టారు. దీంతో కార్యకర్తలతో మొదటి సమీక్ష కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైసీపీ కూడా ప్రకటన చేసింది.

కుప్పం నియోజకవర్గం ఇంచార్జితో పాటు కార్యకర్తలు, కీలక నేతలతో గురువారం తాడేపల్లిలో సమీక్ష సమావేశం జరుగనున్నది. మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ సమీక్షలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. అలాగే పార్టీ పురోగతి, బలోపేతం, అభివృద్ధికి.. ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలను కూడా కార్యకర్తలను అడిగి తెలుసుకోనున్నారు.

ఇక వైసీపీని కుప్పంలో ఎలా బలోపేతం చేయాలి. ప్రత్యర్థుల వ్యాఖ్యలకు ఎలా కౌంటర్ చేయాలననే విషయాలపై సీఎం జగన్ నేరుగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తున్నది. ఏదేమైనా.. సీఎం జగన్ ఇన్నాళ్లూ పాలనపై దృష్టి పెట్టారు. ఇక ఇప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టడం, కార్యకర్తలను నేరుగా కలవడం వల్ల మరింత ఉత్సాహం పెరుగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Tags:    
Advertisement

Similar News