జనంలోకి వెళ్లేందుకు జగన్ రెడీ..
సీఎం జగన్ నేరుగా జనాన్ని కలిసే విధంగా ఓ కార్యక్రమం చేపట్టాలని చాలా రోజులుగా ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. జనంలోకి వెళ్లేందుకు జగన్ రెడీగానే ఉన్నారని, ఈ కార్యక్రమానికి ఒక రూపం రావడంలేదని తెలుస్తోంది.
ప్రతిపక్షాలు నిత్యమూ ప్రజల్లో ఉండే కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరీ పేరుతో విరామం ఎరుగని టూర్‌తో మూడు ప్రాంతాలనూ చుట్టేస్తున్నారు. ఆయన తనయుడు లోకేష్ యువగళం పాదయాత్ర పేరుతో ఇప్పటికే రాయలసీమ, ఆంధ్రలో కొన్ని జిల్లాలలో పర్యటన పూర్తి చేసుకున్నారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో తనకు పట్టున్న ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఇవి అన్నీ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
విపక్షాలు ఇంత హడావిడిగా కార్యక్రమాలలో తలమునకలై ఉంటే, అధికార పక్ష నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేవలం ప్రభుత్వ పథకాల ప్రారంభ కార్యక్రమాలకి మాత్రమే హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గడప గడపకీ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమాలను ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. జగనన్నకి చెబుదాం, జగనన్న సురక్ష ప్రోగ్రాములు గ్రామస్థాయిలో ప్రతీ ఇంటికి వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాన్ని వివరించడం, వారికి వివిధ ధ్రువ పత్రాలు అందజేయడం లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్నారు.
సీఎం జగన్ నేరుగా జనాన్ని కలిసే విధంగా ఓ కార్యక్రమం చేపట్టాలని చాలా రోజులుగా ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. జనంలోకి వెళ్లేందుకు జగన్ రెడీగానే ఉన్నారని, ఈ కార్యక్రమానికి ఒక రూపం రావడంలేదని తెలుస్తోంది. ఒక ఊరిలో ముఖ్యమంత్రి నిద్ర చేసే విధంగా ప్లాన్ చేశారని, రచ్చబండ నమూనాలో మరో ప్రోగ్రాం డిజైన్ చేశారని, వివిధ వర్గాలతో సీఎం భేటీ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకూ ఈ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలు, పేరు ఖరారు కాలేదని తెలుస్తోంది.